గడప దగ్గరి ఉగ్రవాదాన్ని... పార్లమెంట్లోకి రాకుండా ఎన్నాళ్లు ఆపగలం?

ట్రంప్ అధికారంలోకి వచ్చాక అతిపెద్ద రచ్చగా మారిన అంశం ఇస్లామిక్ టెర్రరిజమ్. అమెరికా అధ్యక్షుడు తన ఎన్నికల ప్రచారం సమయం నుంచే ఉగ్రవాదాన్ని తీ్వ్రంగా పరిగణించాడు. అంత వరకూ అందరికీ ఓకే. కాని, ట్రంప్ నేరుగా ఇస్లామిక్ ఉగ్రవాదం అంటూ వేలెత్తి చూపటం ఆయనని చాలా మందికి శత్రువుని చేసింది. టెర్రరిజమ్ "హేజ్ నో రిలీజన్" అనే వారికి ట్రంప్ అస్సలు నచ్చలేదు. ఇప్పటికీ నచ్చటం లేదు కూడా. అందుకే, ట్రంప్ ప్రతీ నిర్ణయానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత, నిరసనలు వస్తున్నాయి. మీడియా బోలెడంత హైలైట్ చేస్తోంది. కాని, తాజాగా జరిగిన లండన్ వెస్ట్ మినిస్టర్ ఎటాక్ ట్రంప్ వాదన పై మరోసారి దృష్టి పెట్టేలా చేస్తోంది!

 

ఇంతకీ లండన్ పార్లమెంట్ మీదకి దూసుకొచ్చి దాడికి తెగబడ్డ వ్యక్తి ఎవరు? ఇప్పటి వరకూ బయటకొచ్చిన సమాచారం ప్రకారం అతను బ్రిటన్ లోనే పుట్టిన పౌరుడు. కాని, అతని పేరు, ఇతర వివరాలు ఇంకా బయటకి రాలేదు. అతను ముస్లిమ్ అని బ్రిటన్ ప్రధాని కూడా చెప్పలేదు. కాని, జరిగిన దాడి మాత్రం ఎవరో ఉన్మాది చేసింది కాదనీ, ఉగ్రవాద చర్యేనని ఆమె పార్లమెంట్లో అదికారికంగా చెప్పారు. 

 

అసలు ఒక బ్రిటన్ పౌరుడు తమ స్వంత పార్లమెంట్ మీదకి వాహనంలో ఎందుకు దూసుకొచ్చాడు? ఏ పాపం తెలియని వివిధ దేశాల పౌరుల్ని ఎందుకు పొట్టన బెట్టుకున్నాడు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దర్యాప్తులో తేలుతాయి. కాని, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోన్న ధోరణి చూస్తే మనం చాలా స్పష్టంగా కారణం ఏంటో గ్రహించవచ్చు. సిరియా, ఇరాక్ లాంటి అంతర్యుద్ధంతో దద్ధరిల్లుతోన్న ఇస్లామిక్ దేశాలు మొదలు అక్కడి శరణార్థులకి ఆశ్రయం ఇచ్చిన యూరోపియన్ దేశాల వరకూ అన్నీ ఉగ్రవాదంతో ఉడికిపోతున్నాయి. అందుకు కారణం ఇస్లామిక్ అతివాదం. దీన్ని చాలా మంది మేధావులు, మీడియా వారు, రాజకీయ నేతలు గుర్తించటానికి ఇష్టం పడటం లేదు. అక్కడే సమస్యంతా ఉత్పన్నం అవుతోంది. నిజానికి ఇస్లామిక్ ఉగ్రవాదం అనగానే ముస్లిమ్ లు అంతా టెర్రరిస్టులని ఎవ్వరి ఉద్దేశమూ కాదు. కాని, ప్రపంచ వ్యాప్తంగా ఇతర మతాలతో పోలిస్తే ప్రస్తుతం ఇస్లామ్ ఎక్కువగా ఉగ్రవాదానికి దోహదపడుతోంది. అందులోని మత బోధనలు, గ్రంథాలు అన్నీ హింసను ప్రేరేపించేవిగా వ్యాఖ్యానించబడుతున్నాయి. అదే మరే మతంలోని యువతా హింసకు ఆకర్షింపడబనంతగా ముస్లిమ్ యువకులను ఉగ్రవాదం వైపు నెడుతోంది. 

 

కొన్నాళ్ల వరకూ అమెరికా, ఇతర అగ్రదేశాలు తమ స్వార్థం కోసం ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని రాజేస్తూ వచ్చాయి. కాని, ఇప్పుడు అది వారి వద్దకు వచ్చేసింది. సెగ తమకు తగిలిన కొద్దీ ట్రంప్ లాంటి వారు అలెర్ట్ అయ్యి ముస్లిమ్ లను తిట్టిపోస్తున్నారు. కొన్ని దేశాల వారు అసలు తమ భూభాగంలో కాలుపెట్టొద్దని అంటున్నారు. అది తాత్కాలికంగా భద్రత సమస్యకు పరిష్కారం కావొచ్చు. కాని, అసలు ప్రపంచాన్ని కబళిస్తున్న ఉగ్రవాదానికి సమాధానం కాదు.

 

టెర్రరిజానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి అమెరికా లాంటి దేశాలు తమ నీచమైన స్వార్థం కోసం ఎక్కడో ఒక దగ్గర యుద్దాలు జరిపించటం మానుకోవాలి. చమురు కోసం, రాజకీయం కోసం ఆసియా దేశాలు, ఆఫ్రికా దేశాల భవిష్యత్ ఆటలాడుకోవటం మానాలి. అలాగే, ఇస్లామ్ లో కొనసాగుతున్న అతివాద ధోరణుల్ని అందరూ గుర్తించాలి. అమెరికా తన ఆయుధాలు అమ్ముకోటానికి ప్రపంచంలో ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తుందన్నది నిజమే. కాని, అంతే నిజం, ఇస్లామిక్ అతివాద ప్రభావం ఎక్కువగా వున్న ప్రాంతాలే అమెరికా ఆయుధాల విక్రయానికి ఫేవరెట్స్ గా వుంటున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందో మీడియా, మేధావులు, రాజకీయ నేతలు, రచయితలు, విద్యావంతులు చర్చ చేయాలి! అప్పుడే శాశ్వత పరిష్కారం లభిస్తుంది... 

 


తాజాగా జరిగిన లండన్ దాడిలో ఒక బ్రిటన్ పౌరుడే మాతృ దేశానికి శత్రువయ్యాడు. పార్లమెంట్ మీదకి తెగబడ్డాడు. మన దగ్గర అఫ్జల్ గురు కేసు కూడా ఇలాంటిదే! ఈ దేశం వనరులు వాడుకుని విద్యాబుద్ధులు నేర్చుకుని కూడా కూర్చున్న కొమ్మనే నరుక్కోటానికి వ్యూహం పన్నాడు. అంతకంటే ఆందోళనకరం ఏంటంటే... అఫ్జల్ గురుకు ఢిల్లీ నడిబొడ్డులో జేఎన్ యూ క్యాంప్ లో మద్దతు లభించింది! అతడ్నో త్యాగమూర్తిగా భావించే అతివాద విద్యార్థులు మన విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నారు.

 

సరిగ్గా ఇలాంటి పరిస్థితే బ్రిటన్ ది కూడా. అక్కడికి శరణార్థులుగా వచ్చిన ముస్లిమ్ ప్రజలే కాదు... ఆ దేశ పౌరులు కూడా వ్యవస్థకి వ్యతిరేకమవుతున్నారు. యూరోపియన్ దేశాలన్నిట్లో ఇదే పరిస్థితి! ఎందుకు ఇలా జరగుతుందో నిజాయితీగా విమర్శ చేసుకోవాలి, అందులో మతం పాత్ర ఎంతో, స్వార్థ రాజకీయం పాత్ర ఎంతో తేల్చుకోవాలి. సరి చేసుకోవాలి. లేదంటే... పార్లమెంట్ ముంగిట దాకా వచ్చిన ఉగ్రవాది ఏదో ఒక రోజు లోనికి కూడా రాగలుగుతాడు. ఇవాళ్ల భద్రత సిబ్బంది, అమాయక ప్రజలు చనిపోయినట్టే... రేపు ప్రముఖ రాజకీయ వేత్తలు కూడా బలవుతారు. ఎందుకంటే, బుల్లెట్ కు కామన్ పీపుల్, వీఐపీలు అన్న తేడా వుండదు! వినాశనమే దాని ఫలితం...