TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నకిలీ కరెన్సీకి అడ్డాగా మారిన తూర్పుగోదావరి

Published on: Fri May 11, 2012 7:59AM

తూర్పుగోదావరి జిల్లా తీరప్రాంతం కోట్లాది రూపాయల దొంగనోట్లకు కేంద్రమవుతోంది. ఈ జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి, అనపర్తి, బిక్కవోలు, గొల్లలమామిడాడ తదితర కేంద్రాల ద్వారా ఈ వ్యాపారం విస్తరిస్తోంది. ఏడాదికి కనీసం రెండుసార్లు జిల్లాలోని పై ఏ రెండు ప్రాంతాలనుంచైనా కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది రాజమండ్రిని ఈ వ్యాపారానికి సేఫ్ జోన్ గా గుర్తించారు. కాకినాడలో గతనెల ఏడుగురు సభ్యుల ముఠా అరెస్టు అయ్యింది. ముంబై కేంద్రంగా ఈ నోట్లను ముద్రిస్తున్నారని ఈ ముఠా ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే రాజమండ్రిలో ఉన్న అనుభవాలు పరిశీలిస్తే అంతర్జాతీయ ముఠా దీనిలో కీలకపాత్ర పోషిస్తోంది. కరెన్సీని తెచ్చి రాజమండ్రికి చెందిన వ్యక్తులకు అందించేందుకు బైటి వ్యక్తులు వస్తున్నారు.

 

 

ఇలానే నగరానికి చెందిన కుమార్ అనే వ్యక్తికీ ఇచ్చేందుకు పశ్చిమబెంగాల్ నుంచి ముగ్గురు ఆరులక్షల రూపాయల నకిలీ కరెన్సీ తీసుకుని రాజమండ్రి రైల్వేష్టేషన్ లో పోలీసులకు దొరికిపోయారు. వీరి ద్వారా ఇప్పటివరకూ 40లక్షల నకిలీ కరెన్సీ నగరంలో చెలామణి అవుతోందని సమాచారం అందింది. పెట్రోలుబంకులు, వైన్స్, బార్ లు, వస్త్రవ్యాపారులు, గ్రామీణ ప్రాంతాల్లో సంతలు కూడా ఈ నకిలీకరెన్సీ చెలామణికి ఉపయోగపడ్డాయని నిందుతులు స్పష్టం చేశారు.

 

 

గతేడాది సెప్టెంబరు 25న 11 మంది సభ్యుల ముఠాను కాకినాడలో పట్టుకున్నారు. ఇక్కడ గతంలో ఒక్క రెడ్డి సామాజికవర్గంపై నకిలీ కరెన్సీ చెలామణి ఆరోపణలు వచ్చేవి. అయితే ఇప్పుడు అన్ని సామాజికవర్గాలు ఇందులో చేరిపోయారని పోలీసులు అంటున్నారు. నకిలీ నోట్లు విదేశాలనుంచి తెప్పించి మారకం చేయటంలో సిద్ధహస్తులైన వారి పూర్తి వివరాలు పోలీసులు సేకరించలేకపోతున్నారు. తాము గతంలో జిల్లాలోని ప్రింటర్స్, ప్రెస్ లపై నిఘా ఉంచామని ఇప్పుడు కొత్తగా జిల్లాలో అడుగుపెట్టేవారిపై నిఘా పెట్టాల్సి వస్తోందని పోలీసులు అంటున్నారు.