పశ్చిమ ఆక్వా రైతులతో పెట్టుకుంటే అంతేమరి
Published on: Mon Apr 2, 2012 7:16AM
పశ్చిమగోదావరి జిల్లా ఆక్వా రైతులు ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదిగారు. వారు పేరుకే ఆక్వా రైతులుగాని నిజానికి రైతుల రూపంలో వున్న వారంతా రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలే. వీరికి పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు, గణపవరం, తాళ్ళ, భీమవరం, ఆకివీడు, మొగల్తూరు, నర్సాపురం మండలాల్లో సుమారు లక్ష ఎకరాల చేపలు, రొయ్యల చెరువులు ఉన్నాయి. ఎన్నికల సమయంలో వీరిచ్చే నిధులపై ఆయా రాజకీయపార్టీలు ఆశగా ఎదురుచూస్తుంటాయి.
ఇక్కడ పెంచే చేపలు, రొయ్యలను విదేశాలకు ఎగుమతి చేస్తూ ఈ వ్యాపారులు కోట్లాది రూపాయలు ఆర్జించారు. కాలక్షేపంకోసం వీరు కోట్లాది రూపాయల బెట్టింగ్ లు కాస్తుంటారు. అయితే జిల్లా రెవెన్యూ యంత్రాంగం వీరిని తక్కువగా అంచనా వేసింది. వ్యవసాయ భూములను చేపల చెరువులుగా మార్చినందుకు 10 శాతం పన్ను చెల్లించాలంటూ ఇటీవల రెవెన్యూశాఖ ఆక్వా రైతులకు నోటీసుకు ఇచ్చింది. నిజానికి వ్యవసాయ భూములను వ్యవసాయేతర పనులకు ఉపయోగించుకోవడానికి ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్ క్రింద వేలాది రూపాయల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ చట్టాన్ని ఆక్వా రైతులకు కూడా అన్వయిస్తే కోట్లాది రూపాయల్లో ఆదాయం వస్తుందని రెవెన్యూ అధికారులు భావించారు. భావించిందే తడువుగా నోటీసులు జారీ చేశారు. దీంతో ఆక్వా వ్యాపారులు ఒక చిన్నపాటి సమావేశాన్ని ఏర్పాటుచేసుకుని ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. వీరి నిర్ణయాన్ని మిగిలిన రైతులు కూడా అంగీకరించి తమవంతు సహాయం చేశారు. సూట్ కేసులతో బయలుదేరిన ఈ వ్యాపారులు హైదరాబాద్ లో ప్రభుత్వ పెద్దలను కలుసుకుని పదినిముషాల్లో తమ సమస్యను పరిష్కరించుకున్నారు. వీరు తిరిగి భీమవరం వచ్చే సమయానికి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం ఆక్వా రైతులు ల్యాండ్ కన్వర్షన్ ఫీజును చెల్లించనక్కరలేదు. ఈ జీవోతో షాక్ తిన్న రెవెన్యూయంత్రాంగం మరోసారి ఆక్వా వ్యాపారుల జోలికి పోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు.


