Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సంక్షేమ పథకాల రీ ఇంజనీరింగ్ జరగాలి!
posted on: Feb 14, 2026 7:37AM

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం (ఫిబ్రవరి 14) అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, కేటాయింపులు, అభివృద్ధి, సంక్షేమం తదితర అంశాలపై తెలుగువన్ ఎండీ కంఠం నేని రవిశంకర్, సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ తో వాస్తవ వేదిక వేదికగా చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ సారాంశం ఇంది.
పీవీ రమేష్ 1985 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అదనపు ప్రధాన కార్యదర్శిగా, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా, ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేశారు. అంతర్జాతీయంగా ఐక్యరాజ్యసమితి,ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ వంటి సంస్థల్లో అత్యున్నత స్థాయి పదవులలో పని చేసిన అనుభవం ఆయన సొంతం. ఆయన కెరీర్ మొత్తంలో నిబంధనల గీత దాటకుండా నిజాయితీగా, నిష్కర్షగా వ్యవహరించారు. తన పరిధిలోనిది కాని పని చేయాల్సి వస్తే సీఎం అయినా సరే ఎలాంటి శషబిషలూ, మొహమాటాలూ లేకుండా ఇది సాధ్యం కాదు సార్ అని చెప్పగలిగిన స్థైర్యం, ధైర్యం ఆయన సొంతం. అటువంటి డాక్టర్ పీవీ రమేష్ బడ్జెట్ అంటే ఏమిటి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల పరిమితి, పాపులిజం వల్ల ఎదురయ్యే విపరిణామాలను విపులంగా వివరించారు.
పోటీలు పడి మరీ ఓట్ల కోసం డబ్బులు పంచుకుంటూ పోతే ఏపీ దివాళా తీస్తుందని హెచ్చరించారు. ఎన్నికల హామీల అమలు అంటూ కేటాయింపులు చేయడం వల్ల బడ్జెట్ మొత్తం సంక్షేమ పథకాలకే సరిపోతోందన్న పీవీ రమేష్ దీని వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని హెచ్చరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 ప్రకారం, రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా అప్పులు చేయకూడదు. 15వ ఆర్థిక సంఘం వరకు రాష్ట్రాలు తమ జిఎస్‌డిపి లో 3.5% వరకు అప్పు తీసుకోవచ్చు. అయితే 16వ ఆర్థిక సంఘం దీనిని మూడు శాతానికి తగ్గించింది. రాష్ట్ర విభజనకు ముందు వరకూ అప్పులు 2.5% కంటే తక్కువగా ఉండేవన్న ఆయన అప్పట్లో రెవెన్యూ సర్ ప్లస్ ఉండేదని వివరించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రం తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయిందని, ప్రభుత్వం నేరుగా చేసే అప్పులే కాకుండా కార్పొరేషన్ల ద్వారా చేసే బడ్జెటేతర అప్పులు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయన్నారు.
ఇక సాధారణంగా ఖర్చు పెట్టే డబ్బు వల్ల భవిష్యత్తులో ఎటువంటి ఆదాయం వస్తుంది? ప్రజల జీవన ప్రమాణాలు ఏమేరకు పెరుగుతాయి అన్నది హేతువుగా ఉండాలన్న పీవీ రమేష్.. ప్రస్తుత ప్రభుత్వాలు మాత్రం అటువంటి విషయాలపై దృష్టి పెట్టకుండా, రాజకీయ లబ్ధే లక్ష్యంగా సొమ్ముల పందేరానికే ప్రాధాన్యత ఇస్తున్నారని పీవీ రమేష్ అన్నారు. పోలవరం వంటి కీలక ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల ఖర్చు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో 30 శాతానికి పైగా పిల్లలు పోషకాహార లోపం, 50 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. వీటన్నిటికీ బడ్జెట్ లో పరిష్కారాలు చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచాలంటే.. ఉన్న అప్పులు ఎంత, ఆర్థిక పరిస్థితి ఏమిటి అనే వాటి విషయంలో పారదర్శకత పాటించి సవరించుకోవాలన్నారు. ఎక్కువ వడ్డీకి తీసుకున్న అప్పులను తక్కువ వడ్డీకి మార్చుకునే మార్గాలను అన్వేషించాలి. సంక్షేమ పథకాలను అర్హులకు మాత్రమే అందేలా చర్యలు తీసుకోవాలి. తల్లికి వందనం వంటి పథకాలను ధనికులకు కూడా వర్తింప చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. విద్య, వైద్యం, పోషకాహారం వంటి వాటిపై పై పెట్టుబడి పెట్టాలన్నారు. ప్రతి పథకాన్ని మళ్ళీ సమీక్షించి, దాని వల్ల ఎవరికి ఉపయోగం ఉందో చూసి రీ-ఇంజనీరింగ్ చేయాలని డాక్టర్ పీవీ రమేష్ అన్నారు.
డాక్టర్ పీవీ రమేష్ తో తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో వీక్షించండి.


.webp)
.webp)


