చింతే తప్ప... చినుకు లేదు...

నాలుగు చినుకులు రాల్చమ్మా అంటూ ఆకాశం కేసి చూస్తున్నారు తెలుగు రైతులు. ఖరీఫ్ ముగిసే రోజులు దగ్గర పడుతున్నా వరుణ దేవుడి కరుణ మాత్రం తెలుగు రైతులపై కురిపించడం లేదు. సీజన్ ముగియడానికి ఇక ఎన్నో రోజులు లేదు. వర్షాలు మాత్రం రైతులను ఊరిస్తున్నాయి తప్ప ఎక్కడా చినుకు జాడే లేదు. ఈ ఏడాది సగటు వర్షపాతం కంటే కూడా తక్కువగానే వర్షాలు కురిసాయి. దీంతో పంటలకు సిద్ధమైన రైతులు అటు ఆకాశం వైపు... కింద భూమి వైపు చూస్తున్నారు. ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా వర్షాలు పడడం లేదు.

 

 

అయితే ఈ సంవత్సరం  వేసవి కాలంలో ఎండలు మరింత మండిపోవడంతో వర్షాలు కూడా ఆ స్ధాయిలోనే ఉంటాయని వాతావరణ శాఖ పేర్కోంది. దీంతో నగరాల్లోని వారు ఎండలను తిట్టుకుంటూ గడిపినా... గ్రామాల్లో రైతు కుటుంబాలు మాత్రం ఊరించే వర్షాల కోసం ఉవ్విళ్లూరుతూ గడిపారు. వేసవి కాలం వెళ్లింది. వర్షాకాలం వచ్చింది. తొలి వారం, పది రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిపినా ఆ తర్వాత నుంచి చినుకు జాడే లేదు. ఖరీఫ్ సీజన్ ముగిసి పోతున్న దశ కూడా వచ్చేసింది. ఆకాశంలో అక్కడక్కడా... అప్పుడప్పుడు మబ్బుల పొరే తప్ప వర్షం మాత్రం కరుణ చూపించలేదు.

 

 

పొలాల్లో రైతులు విత్తు నాటి... ఎరువుల కోసం పడిగాపులు పడి.... వ్యవసాయ పనుల కోసం సమాయత్తమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా ఏరువాకను ఓ పండగలా ప్రారంభించింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు, తెలుగుదేశం నాయకులు ఈ పండుగను రాష్ట్రం అదిరిపోయేలా ప్రారంభించారు. ఇక తెలంగాణలో కూడా ప్రభుత్వం అట్టహాసంగానే ఏరువాకకు స్వాగతం పలికింది. ఖరీఫ్‌కు ముందు వచ్చే ఉగాది నాడు పంచాగకర్తలు కూడా ఈ ఏడాది వర్షాలు భారీగా ఉంటాయని, రైతు కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని ముక్తాయింపు ఇచ్చారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. ప్రభుత్వాలు, పండితులు చెప్పినంత మాత్రాన వరుణుడు కరుణిస్తాడా...!? కరుణించలేదు. చినుకు నేలపై రాలలేదు. దీంతో రైతుల పరిస్ధితి దీనాతిదీనంగా... దారుణంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం ప్రకటించి చేతులు దులుపుకుంది. ప్రత్నామ్నాయ ఏర్పాట్లపై ఏ ప్రభుత్వాలు శ్రద్ధ చూపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్‌పై రైతులు ఆశలు వదులుకోవాల్సిందే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సాగునీరు అందించే ఏ ప్రాజెక్టులోను సరిపడా నీరు లేదు.

 

 

నాగార్జనసాగర్ ప్రాజెక్టు కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో ఆరు లక్షలకు పైగా ఎకరాల ఆయకట్టు ఉంది. దానికి సరిపడా నీరు అందించేందుకు సాగర్ సిద్ధంగా లేదు. ఈ ప్రాజెక్టు నుంచి 54 టిఎంసీల నీరు సాగుకు అవసరం. అయితే ఇక్కడ ఒక్క టిఎంసీ కూడా లేకపోవడం ఇరు రాష్ట్రాల రైతులను కలవరపరుస్తోంది. ఈ ఖరీఫ్‌లో నీటిని అందించలేమంటూ నీరుపారుదల శాఖ ఇంజనీర్లు చేతులెత్తేశారు. ఇక గోదావరి బేసిన్‌లో కూడా సరిపడా నీళ్లు లేవు. గోదావరి బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టుల్లో నీరు లేదు. దీంతో రైతుల పరిస్ధితి అగమ్య గోచరంగా మారింది.

 

 

ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లోనూ కూడా చుక్క నీరు లేదు. ఇక్కడి ప్రాజెక్టుల్లో కూడా తెలంగాణ ప్రాజెక్టుల పరిస్థితే కనిపిస్తోంది. వ్యవసాయాధారిత దేశంలో రైతుల బతుకులు దీనావస్ధకు చేరుతున్నాయంటే దీనికి కారణం... నైతిక బాధ్యత కచ్చితంగా ప్రభుత్వాలదే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా నిర్ణయం తీసుకుని రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలి. నీటి ఆధారిత పంటలపై కాకుండా వాణిజ్య పంటలు, నీరు తక్కువ అవసరం ఉండే పంటలపై శ్రద్ధ పెంచేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలి. రైతులకు అవసరమైన అన్ని చర్యలను పంటల సీజన్ ప్రారంభానికి ముందే తీసుకోవాలి. దీనికి ఏ ఒక్క ప్రభుత్వమో పూనుకుంటే చాలదు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా రైతులు దీనావస్ధలోనే ఉన్నారు కనుక అందరూ కలిసి కార్యాచరణ రూపొందించాలి. ఇందుకోసం తమ తమ రాజకీయాలను పక్కన పెట్టాలి. రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలి. నూటికి 70 మందికి పైగా రైతులే ఉన్న దేశంలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గుపడాలి.

 

 

పరిశ్రమలే దేశాభివ్రద్ధికి గీటురాయి అనుకుంటే ఆ పరిశ్రమలకు అనుమతిచ్చే వారు, ఆ పరిశ్రమల యజమానులు, అందులోని ఉద్యోగులు, వారి వారి కుటుంబాలు.. అందరూ తినేది పట్టెడన్నమే అని గుర్తెరగాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. మరి ఆ అన్నాన్ని స్రష్టించిన వారిని ఏమనాలి. ఇంకేమంటాం.. పరబ్రహ్మలు... అంటే భూమ్మీద నడయాడే దేవుళ్లుగానే భావించాలి. అవును... నిజం... ముమ్మాటికి నిజం... రైతులే కళ‌్ల ముందు కదలాడే ప్రత్యక్ష దైవాలు. దైవం కన్నెర్ర చేస్తే సమస్త లోకాలు మాడిపోతాయనే ఎరుక అన్ని ప్రభుత్వాలకు రావాలి.