ఒకటి, రెండు సీట్లతో ఏం చేస్తావ్ జగన్? మాతో కలిసి రా!!

 

కేంద్రం తీరుకు నిరసనగా ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర ప్రయోజనల కోసం ప్రతిపక్ష వైసీపీ తమతో కలిసి రావాలని చంద్రబాబు కోరారు. రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ కట్టుబడి ఉంటే.. టీడీపీ చేస్తున్న ధర్మపోరాట దీక్షకు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకుని రావడానికి రాజకీయాలకు అతీతంగా పని చేయాలని భావిస్తున్నారా? అంటూ ఛానల్ ప్రతినిధురాలు వేసిన ప్రశ్నకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. కేంద్రాన్ని ఎదుర్కొనడానికి రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనికోసం తాను రాజకీయ వైరుధ్యాన్ని కూడా పట్టించుకోనని చెప్పారు. కేంద్రాన్ని ఢీ కొట్టడానికి అన్ని పార్టీలు కూడా తనకు సహకరించాలని సూచించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తనతో కలిసి పని చేస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తానని చంద్రబాబు అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి ఒకటి, రెండు సీట్లే వస్తాయని అన్నారు. ఇంత తక్కువ సీట్లతో సాధించేదేమీ ఉండదని చంద్రబాబు నవ్వుతూ చెప్పారు. అందుకే తమతో కలిసి వస్తే స్వాగతిస్తామని, ఇందులో తప్పేమీ లేదని పేర్కొన్నారు.