TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబుకి మద్దతుగా నిలుస్తాం: అంబటి రాంబాబు

Published on: Thu May 9, 2019 2:22PM

 

ఏపీలో టీడీపీ, వైసీపీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేస్కుంటూ ఉంటారు. అయితే అనూహ్యంగా ఒక విషయంలో మాత్రం వైసీపీ.. టీడీపీకి మద్దతుగా నిలుస్తాం అంటోంది. అదే వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై పోరాటం.

50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని పలు విపక్ష పార్టీలతో కలిసి టీడీపీ పోరాడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో టీడీపీకి మద్దతుగా నిలుస్తాం అంటోంది వైసీపీ.

వైసీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు తాజాగా ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబు చేస్తోన్న పోరాటం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. 50 శాతం మేర వీవీప్యాట్ స్లిప్పుల‌ను లెక్కించాలంటూ చంద్ర‌బాబు చేస్తోన్న డిమాండ్‌లో కొంత‌ నిజాయితీ ఉంద‌ని, నిబద్ధ‌త క‌నిపిస్తోంద‌ని తాను భావిస్తున్న‌ట్లు చెప్పారు. జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశ‌మైన ఈ విష‌యంపై చంద్ర‌బాబు త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌చారం కోసం వాడుకోకూడ‌ద‌ని, చిత్త‌శుద్ధితో పోరాటం చేయాల‌ని అన్నారు. అవ‌స‌ర‌మైతే దీనిపై తాము కూడా చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ అంశాన్ని అడ్డు పెట్టుకుని రాజ‌కీయాలు చేయాల‌నుకోవ‌డం స‌రికాద‌ని అంబ‌టి హిత‌బోధ చేశారు.

సుప్రీంకోర్టు ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో 5 వీవీ ప్యాట్ల‌ను లెక్కించ‌డానికి అవ‌కాశం ఇచ్చిందని, తేడా వ‌స్తే మొత్తం లెక్కించాలని అడ‌గ‌టంలో ధ‌ర్మం ఉంద‌ని అంబటి చెప్పారు. ఒకవేళ ఆ 5 ఈవీఎంలలో తేడా వ‌స్తే, అన్ని ఈవీఎంలనూ లెక్కించాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేయ‌డం స‌బ‌బేన‌ని అంబటి అన్నారు. ఇదే అంశాన్ని అడ్డుగా పెట్టుకుని చంద్ర‌బాబు ఓట్ల లెక్కింపు కేంద్రాల వ‌ద్ద గంద‌రగోళం సృష్టించే అవ‌కాశం ఉంద‌ని తాము భావిస్తున్నామ‌ని చెప్పారు. ఈ విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలని తాము పార్టీ కేడర్‌ను సూచించామ‌ని అన్నారు. దీన్ని స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకోవాల్సిన బాధ్య‌త అధికారులు, త‌మ పార్టీ శ్రేణుల‌పై ఉంద‌ని అంబటి చెప్పారు.