TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

బిర‌బిరా కృష్ణ‌మ్మ‌.. రైతు కంట క‌న్నీటిమంట‌..

Published on: Sat Jul 3, 2021 3:41PM

ప్ర‌కాశం బ్యారేజీ ద‌గ్గ‌ర సుంద‌ర దృశ్యం. 20 గేట్లు ఎత్త‌డంతో కృష్ణ‌మ్మ బిర‌బిరా ప‌రుగులు పెడుతోంది. ఆ వాట‌ర్ వండ‌ర్ చూసేందుకు స్థానికులు త‌ర‌లివ‌స్తున్నారు. అబ్బా.. ఏముంది సీన్ అంటూ సంబ‌ర‌ప‌డుతున్నారు. ఈ దృశ్యం వారికి వినోద‌మైతే.. రైతుల పాలిట‌ విల‌యం. 

బంగారు పంట‌లు పండించాల్సిన కృష్ణా జ‌లాలు ఇలా వృధాగా స‌ముద్రం పాల‌వుతుండ‌టంతో దిగువ ప్రాంత రైతులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కాలం కాని కాలంలో ఇంత నీటిని స‌ముద్రంలోకి విడుద‌ల చేయాల్సి రావ‌డంపై బ్యారేజ్ సిబ్బంది సైతం బాధ‌ను వ్య‌క్తం చేస్తున్నారు. 

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం ముంద‌ర‌డంతో తెలంగాణ ప్ర‌భుత్వం పంతానికి పోతోంది. నీటిల‌భ్య‌త స‌రిప‌డా లేకున్నా.. శ్రీశైలం, నాగార్జున సాగ‌ర్‌, పులిచింత‌ల‌లో విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తోంది. ఏపీ అభ్య‌ర్థ‌న‌ల‌ను అస‌లేమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. తెలంగాణ‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో సీఎం జ‌గ‌న్ సైతం ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. 

ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లో తెలంగాణ జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తోంది. ఆ ప్ర‌వాహ‌మంతా వ‌చ్చి ప్రకాశం బ్యారేజీకి చేరుతోంది. బ్యారేజీలో ప్రస్తుతం 3.07 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వలు ఉన్నాయి. దీంతో అదనపు నీటిని నిల్వ చేయలేక విధిలేని పరిస్థితితో సముద్రంలోనికి విడిచిపెడుతున్నారు అధికారులు. మొత్తం 20 గేట్ల ద్వారా 8,340 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. 

ఎగువ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు 39,700 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఈ ప్రాజెక్టు దగ్గ‌ర‌ తెలంగాణ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి చేయడంతో 7,200 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోంది. మరోవైపు నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి 62,446 క్యూసెక్కులు, శ్రీశైలం నుంచి 21,229 క్యూసెక్కుల నీరు దిగువకు వ‌స్తోంది. ఆ నీటి ప్ర‌వాహమంతా ప్ర‌కాశం బ్యారేజీ గుండా స‌ముద్రంలో క‌లుస్తోంది. ఒక్కో నీటి చుక్కా ఒడిసిప‌ట్టుకొని.. బంగ‌రు పంట‌లు పండించాల్సింది పోయి.. ఇలా జ‌లామృతాన్ని వృధాగా ఉప్పునీటి సంద్రం చేయ‌డం రైతుల‌కు ఏమాత్రం మంచి ప‌రిణామం కాదు.