'నీటి'పాలైపోతోన్న స్త్రీలు, బాలికల జీవితాలు!

 

నీటి కటకట... ఈ మాట వినగానే ఇప్పడు చెప్పబోయేదేదో... హైద్రాబాద్ బస్తీల్లో తాగు నీటి సమస్య గురించి అనుకోకండి! పోనీ, దేశంలోని తీవ్ర కరువు పరిస్థితుల  గురించి అనుకోకండి! మనం ఏకంగా ప్రపంచం గురించే మాట్లాడుకోబోతున్నాం! భూమ్మీద చాలా దేశాలు నీటి కటకటతో అల్లాడుతున్నాయి. అంతే కాదు, నీరు నేరుగా స్త్రీజాతి కన్నీరవుతోంది. అదే పెద్ద విషాదం... 

 

నీరు చాలా ముఖ్యమైన అవసరం. నీళ్లు లేకపోతే ఏది వున్నా ఏం లాభం? అందుకే, మనిషి నీటి లభ్యత వున్న చోటే నాగరికతలు నిర్మించుకున్నాడు. కాని, నదులు, వాగుల పక్కకు బతికేయడం మొదలు ఇవాళ్ల చంద్రుడిపై నీరుందని కనుక్కునే దాకా ఎంతో ఎదిగాడు. అయినా నీటి విషయంలో మనిషి ప్రయాణం ఒకడుగు ముందుకి, రెండడుగులు వెనక్కి అన్నట్టే సాగుతోంది!

 

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో నీటి కోసం నానా తంటాలు పడుతుంటారు జనం. ఇంతటి కంప్యూటర్లు, రాకెట్ల కాలంలో కూడా గుక్కెడు మంచి నీటి కోసం కిలో మీటర్లు పోవాల్సిన అభాగ్యులు చాలా మందే వున్నారు. అలాంటి దుర్భర పరిస్థితులున్న చోట్లలో మరో విషాదం కూడా దాగి వుంది. ఎక్కడైతే నీటి లభ్యత కష్టంగా వుంటుందో అక్కడ నీళ్లు తెచ్చే పని చాలా వరకూ మహిళలు, బాలికలపైనే పడుతుంటుంది. ఇది పైకి మామూలు విషయంలా కనిపించినా ఆందోళనకరమైన అంశాన్ని సూచిస్తుంది.

 

యూనిసెఫ్ సంస్థ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా దేశదేశాల్లో మహిళలు, బాలికలు రోజుకి ఎంత సేపు నీటి సేకరణ కోసం ఖర్చు చేస్తున్నారో తెలుసా? అందరూ కలిపి రోజుకి 200మిలియన్ల గంటలు వ్యయం చేస్తున్నారట! అంటే... 22,800 సంవత్సరాలు! ఇలా ప్రతీ రోజూ అంత సమయం ప్రపంచ వ్యాప్తంగా మహిళలు, బాలికలు వెచ్చిస్తూనే వుండాల్సి వస్తోంది... 

 

మనిషి భూమ్మీది కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కోణాల్లో ఎంతగా అభివృద్ధి చెందినా అత్యధిక భాగం మాత్రం వెనుకబడే వుండిపోతున్నాడు. అందుకు, ఎన్నో దేశాల్లోని స్త్త్రీలు, బాలికలు కనీస నీటి కోసం తమ విలువైన సమయాన్ని ఇలా వెచ్చించటమే చక్కటి ఉదాహరణ. మామూలుగా అయితే, నీటి కోసం తమ అమూల్యమైన జీవితాల్ని నీటి పాలు చేసుకుంటున్న ఈ మహిళలు, బాలికలు ఎంతో అభివృద్ధికి దోహదపడాల్సిన వారు! కాని, వారి శక్తి, యుక్తి అంతా నీటి కోసం... నీటి పాలైపోతూనే వుంది!

 

2050 కల్లా వెయ్యి కోట్ల జనాభా భూమిపై వుంటుందని అంచనాలున్నాయి. ఇక అప్పుడు ఈ నీటి కటకట ఎంతగా వుంటుందో, మహిళలు, బాలికలు ఇంకెంతగా తమ కాలాన్ని నీటి కోసం ఖర్చు చేయాల్సి వుంటుందో మనం ఊహించుకోవచ్చు. అందుకే, ఇప్పటి నుంచే అన్నీ దేశాలు నీటి ఆదా, నీటి సరఫరాపై దృష్టి పెట్టాలి...