TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాముడి కంట కన్నీరు.. క‌రోనానే కార‌ణ‌మంటున్న భ‌క్తులు!

Published on: Thu Jun 17, 2021 7:58PM

క‌లికాలంలో రాముడి కంట క‌న్నీరు కారుతోంది. రాములోరికి ఏం క‌ష్టం వ‌చ్చిందోన‌ని భ‌క్తులు ఆందోళ‌న చెందుతున్నారు. రాముడి క‌న్నీరు తుడిచే ప్ర‌య‌త్నం చేసినా.. కంట నీరు మాత్రం ఆగ‌డం లేదు. ఈ అనూహ్య ప‌రిణామం ఖ‌మ్మం జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీరాముని విగ్రహం కంటి వెంట నీరు కారుతుండ‌టం స్థానికంగా కలకలం రేపుతోంది. కొంద‌రు వింత‌గా చూస్తుంటే.. మ‌రికొంద‌రు మాత్రం అరిష్ట‌మంటూ భ‌య‌ప‌డుతున్నారు. 

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకటయి తండాలోని సమ్మక సారలక్క ఆలయంలో రాముడి విగ్రహం కొలువుదీరి ఉంది. విగ్రహం ఎడమ కంటి నుంచి నీళ్లు కారుతున్నాయి. ఈ విష‌యం చుట్టుప‌క్క‌ల గ్రామాల్లో ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో అంతా పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తున్నారు. 

ఐదేళ్లుగా ఈ ఆలయంలో రాముడి కళ్యాణం జరిపిస్తున్నారు గ్రామస్తులు. తన కలలో శ్రీరాముడు కనిపించి కన్నీరు పెట్టుకున్నారని పూజారి చెబుతున్నారు. తెల్లారాక‌ ఆలయానికి వచ్చి చూడగా నిజంగానే రాముడి విగ్ర‌హం కంటి నుంచి నీరు కారుతోంద‌ని అంటున్నారు. 

ఘటనపై తండా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి అరిష్టం జరగబోతోంద‌ని అనుమానిస్తున్నారు. మానవ జాతికి రాబోతున్న ముప్పున‌కు సంకేతమని కొందరు అంటుంటే.. క‌రోనా నేపథ్యంలో రాములోరు కన్నీరు పెట్టుకుంటున్నారు అంటూ ఎవ‌రికి తోచిన విధంగా వారు చర్చించుకుంటున్నారు. ఈ వింతను చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు. గ‌తంలో వినాయ‌కుడి విగ్ర‌హం పాలు తాగడం సంచ‌ల‌నం సృష్టించ‌గా.. తాజాగా ఓ తండాలోని రాముడి విగ్ర‌హం కంటి నుంచి నీరు రావ‌డానికి కార‌ణం ఏంటో క‌నుగొనాల్సి ఉందంటున్నారు.