TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భూ ప్రకంపనలు...కలెక్టర్లకు సీఎం ఆదేశం

Published on: Wed Apr 11, 2012 4:53PM

హైదరాబాద్: సునామీ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఇండోనేషియాలో వచ్చిన భారీ భూకంపం ప్రభావంతో కోస్తాంధ్రలోని శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు ప్రకంపనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

సునామీ హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంతంలోని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రానికి దూరంగా ఉండాలని సూచించారు. సముద్రానికి కనీసం 500 మీటర్ల దూరంలో ఉండాలని నిపుణులు చెబుతున్నారు. తిరుపతిలో రెండో సారి భూమి ప్రకంపించింది. రెండున్నర గంటల పాటు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్‌జిఆర్ఐ శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. అయితే, ప్రమాదం ఉండకపోవచ్చునని అంటున్నారు. రాజమండ్రిలో కూడా రెండోసారి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

నెల్లూరు జిల్లా కావలిలో సముద్రంతీరంలో 2 మీటర్ల మేర నీరు ఎగిసిపడుతోంది. తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో మత్స్యకారులు భయాందోళనలకు గురవుతున్నారు. సముద్రంలోకి వెళ్లకూడదని జాలర్లకు హెచ్చరికలు జారీ అయ్యాయి. రెవెన్యూ మంత్రి రఘువీరా రెడ్డి పరిస్థితిని అధికారులతో టెలిఫోన్‌లో సమీక్షించారు. భారత్‌కు సునామీ వస్తుందనే సమాచారాన్ని నమ్మవద్దని ఎన్ఎండిఎ సూచించింది. అవసరమైతే పునరావాస చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోస్తాంధ్ర జిల్లాల అధికారులను ఆదేశించారు.