వీడిన మిస్టరీ.. ఒక హత్య నుంచి తప్పించుకోవడం కోసం 9 హత్యలు

వరంగల్ లోని గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలోని బావిలో తొమ్మిది మృతదేహాల ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ తొమ్మిది హత్యల కేసును పోలీసులు కేవలం 72 గంటల్లోనే ఛేదించారు. నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్ ను పోలీసులు సోమవారం సాయంత్రం మీడియా ముందు హాజరుపరిచారు. ఒక హత్య నుంచి తప్పించుకోవడం కోసం నిందితుడు మరో 9 హత్యలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మక్సూద్ కుటుంబం గోనె సంచుల ఫ్యాక్టరీలో పని చేస్తుంది. మక్సూద్ భార్య సోదరి కూతురైన రఫీకా(37) ఐదేళ్ల క్రితం బెంగాల్ నుంచి ముగ్గురు పిల్లలను తీసుకొని వరంగల్ వచ్చింది. భర్త నుంచి విడిపోయిన ఆమె.. తన బాబాయి మక్సూద్ సాయంతో గోనె సంచుల ఫ్యాక్టరీలో పనిలో చేరింది. ఈ క్రమంలో ఆమెకి సంజయ్ తో పరిచయం ఏర్పడింది. ఆమె ద్వారా మక్సూద్ కుటుంబంతో కూడా సంజయ్ కి పరిచయం ఏర్పడింది. సంజయ్ ఒంటరి కావడంతో రఫీకా అతడికి భోజనం వండి పెడుతూ డబ్బులు తీసుకునేది. అలా వీరిద్దరి మధ్య పరిచయం పెరిగింది. అది సహజీవనానికి దారి తీసింది. 

ఈ క్రమంలో రఫీకా కూతురు యుక్త వయస్కురాలు కావడంతో సంజయ్ కన్ను ఆ అమ్మాయి మీద పడింది. ఆ అమ్మాయితో సంజయ్ చనువు పెంచుకునేందుకు ప్రయత్నించగా.. రఫీకా మందలించింది. పోలీసులకు కంప్లైంట్ చేస్తానని హెచ్చరించింది. దీంతో సంజయ్ ఎలాగైనా రఫీకాను అడ్డుతొలగించుకోవాలని అనుకున్నాడు. నిన్ను పెళ్లి చేసుకుంటాను, బెంగాల్ తీసుకెళ్లి మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడతానని చెప్పి.. రఫీకాతో కలిసి గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో వరంగల్ నుంచి మార్చి 7న బయల్దేరాడు. పక్కా ప్లాన్‌తో మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. ఆమె పడుకున్న తర్వాత రాత్రి సమయంలో చున్నీని ఆమె మెడకు బిగించి హత్య చేసి, రైల్లో నుంచి బయటకు తోసేశాడు. అనంతరం రాజమండ్రిలో రైలు దిగి ఇంటికొచ్చాడు. నిడదవోలు ప్రాంతంలో రఫీకా బాడీని గుర్తించిన తాడేపల్లిగూడెం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఇటీవల మక్సూద్ కుటుంబం రఫీకా గురించి సంజయ్ ‌ను అడగటం మొదలుపెట్టింది. తన గురించి చెప్పకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించింది. దీంతో తను చేసిన హత్య నుంచి తప్పించుకోవడం కోసం వారిని హతమార్చాలని భావించాడు. మక్సూద్ పెద్ద కొడుకు పుట్టిన రోజు మే 20న ప్లాన్ చేసుకొని మక్సూద్ కుటుంబం నివసించే గోడౌన్ వద్దకు వెళ్లి.. అదను చూసి నిద్ర మాత్రలను వారు తినే ఆహారంలో కలిపాడు. తాను రావడం.. పై పోర్షన్లో ఉన్న శ్రీరామ్, శ్యామ్ చూశారు కాబట్టి వారి ఆహారంలోనూ నిద్ర మాత్రలు కలిపాడు. అలాగే, షకీల్ అనే వ్యక్తి కూడా ముందే అక్కడికి రావడంతో.. మొత్తం 9 మంది గోడౌన్‌లో ఉన్నారు. నిద్రమాత్రల కారణంగా వారందరూ మత్తులోకి జారుకున్నారు. తరువాత ఒక్కొక్కరిని గోనె సంచిలో పెట్టి.. అందర్నీ బావిలో పడేశాడు.