తొండి సంజయ్.. నాలుక చీరేస్తాం! వరంగల్ టీఆర్ఎస్ నేతల వార్నింగ్
Published on: Wed Jan 6, 2021 1:22PM
తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై వరంగల్ టీఆర్ఎస్ నేతలు ఫైరయ్యారు. బండిపై ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు తొండి సంజయ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ‘‘నీది నోరా...? మోరా..? ’’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వినయ్ భాస్కర్. సీఎం కేసీఆర్‌ను విమర్శించే అర్హత బండి సంజయ్‌కు లేదని మండిపడ్డారు. కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు అవాకులు చెవాకులు పేలితే నాలుక చీరేస్తాం అంటూ బండి సంజయ్ కి వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్. బీజేపీ నేతలు ఒళ్లు దగ్గర పెటుకొని ఉండాలన్నారు. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని.. లేదంటే ఖబడ్దార్ అంటూ బీజేపీ నేతలను హెచ్చరించారు వినయ్ భాస్కర్.
మంగళవారం వరంగల్ లో పర్యటించిన బండి సంజయ్ సీఎం కేసీఆర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. సీఎం కేసీఆర్ తోపేం కాదు. పచ్చి దగుల్బాజీ, బడాచోర్, మూర్ఖుడు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మద్యం తాగి పాలన చేస్తున్న ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. ఢిల్లీ వెళ్లొచ్చిన కేసీఆర్.. ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారనీ, ప్రజలను కలవని ఏకైక ముఖ్యమంత్రి ఈయనేనని బండి మండిపడ్డారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. బీజేపీని మతతత్వ పార్టీగా చిత్రీకరించి వరంగల్‌ను మజ్లిస్ అడ్డాగా మార్చేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు బండి సంజయ్.


