పొన్నాల అరాచకాలను అడ్డుకుంటాం: ఎంపి రాజగోపాలరెడ్డి
Published on: Thu Apr 26, 2012 10:30AM
వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. సాక్షాత్తూ రాష్ట్రమంత్రి పొన్నాల లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ ఎంపి రాజగోపాలరెడ్డి పరస్పరం కలహించుకుంటూ పార్టీ పరువును బజారున పడేస్తున్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణకు తలనొప్పిగా మారాయి. తాజాగా జనగాం మండలం పసరమళ్ళలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాజగోపాలరెడ్డిని పొన్నాల వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పొన్నాల, రాజగోపాలరెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడి పరిస్థితి లాఠీచార్జి వరకూ దారి తీసింది. నిజానికి పొన్నాల వర్గీయులకు భయపడి రాజగోపాలరెడ్డి గత మూడేళ్లుగా ఈ ప్రాంతానికి రావటం లేదు.
రాకరాక వచ్చిన పార్లమెంటు సభ్యుడికి చేదు అనుభవం ఎదురుకావటంతో వెంటనే ఆయన పొంనాలపైనా, ఆయన కోడలు వైశాలిపైనా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో పొన్నాల వర్గం సాగిస్తున్న అరాచకాలు రాష్ట్రంలో మరెక్కడా జరగడం లేదన్నారు. తనను నియోజకవర్గానికి రావొద్దని పొన్నాల చిల్లర రాజకీయాలు చేయటం సిగ్గుచేటన్నారు. ఈ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి పొన్నాల లక్ష్మయ్యను కలుసుకుంటే ఐదుగురు బినామీలను ముందుగా కలవాల్సి ఉంటుందని, వీరందరినీ కలవాల్సిన ఖర్మ తనకేంటని ఆయన అంటున్నారు. ఇకపై పొన్నాల ఆటలు సాగవని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు.


