రాజీనామాకు సిద్ధపడుతున్న వరంగల్ డిసిసి చీఫ్
Published on: Sat May 5, 2012 12:48PM
పరకాల కాంగ్రెస్ టిక్కెట్టు తన భార్య గండ్ర జ్యోతికి ఇవ్వనందుకు నిరసనగా ఆమె భర్త, వరంగల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయిన గండ్ర వెంటకరమణారెడ్డి తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జిల్లాలో పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న సమయంలో తాను, తన భార్య ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుని పార్టీ కోసం త్యాగాలు చేశామనీ, కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వకుండా పరకాలకు పార్టీ అభ్యర్థిని ఏకపక్షంగా ప్రకటించారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గండ్ర జ్యోతి కాంగ్రెస్ పార్టీ తరపున పరకాల నుంచి పోటీ చేయాలని ఆశించారు. అయితే పార్టీ అధినాయకత్వం ఇటీవలే టిడిపి నుంచి వచ్చిన సాంబారి సమ్మారావుకు టిక్కెట్టు ఇచ్చింది. తన సతీమణికి పరకాల టిక్కెట్టు ఇచ్చినా ఇవ్వక పోయినా తానేమీ పట్టించుకోనని, కానీ జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఎక్కువ కాలం పనిచేసిన తనకు మాట మాత్రమైనా చెప్పకుండా టిడిపి నుంచి వచ్చిన సమ్మారావుకు టిక్కెట్టు ఇవ్వాల్సిన ఖర్మ ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నిస్తున్నారు. తనకు మాట మాత్రమైనా చెప్పకుండా అభ్యర్థిని ఖరారు చేయటంతో ఇంతకాలం డిసిసి అధ్యక్షపదవిలో ఉండటం భావ్యం కాదని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల నేపథ్యంలో గండ్ర వెంకటరమణా రెడ్డి రాజీనామా చేస్తే కోలుకోలేని దెబ్బ తగిలినట్లు అవుతుందనటంలో సందేహం లేదు.


