బీజేపీకి గుణపాఠం నేర్పిన ఉప ఎన్నికలు

 

బిహార్ తరువాత వరంగల్ ఉప ఎన్నికలలో బీజేపీ పరాజయం పొందడం ఆ పార్టీకి కొంచెం ఇబ్బందికరమయిన పరిస్థితినే సృష్టించిందనే చెప్పవచ్చును. అందుకు తెలంగాణా బీజేపీ నేతలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. తమ వద్ద ఈ ఉప ఎన్నికలలో పోటీ చేయడానికి బలమయిన అభ్యర్ధిలేడని తెలిసిఉన్నప్పుడు మిత్రపక్షమయిన తెదేపాకు ఆ అవకాశం విడిచిపెట్టి ఉండాల్సింది. ఎందుకంటే తెదేపాలో మంచి రాజకీయ అనుభవం, అంగ బలం, అర్ధ బలం పార్టీ క్యాడర్ సపోర్ట్ ఉన్న నేతలు చాలా మందే ఉన్నారు. తెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఈ ఉప ఎన్నికలలో పోటీ చేయడానికి సంసిద్దత వ్యక్తం చేసారు. కానీ బీజేపీ నేతలు తమ వద్ద అంత బలమయిన అభ్యర్ధి లేకపోయినప్పటికీ, ఆ సీటు తీసుకొని డా. దేవయ్యను వెతికిపట్టుకు వచ్చి నిలబెట్టారు. తత్ఫలితంగా వారు తెరాసకు పని సులువు చేసిపెట్టినట్లయింది. అంతే కాదు చేజేతులా ఒక సువర్ణావకాశాన్ని జారవిడుచుకోవడమే కాకుండా మిత్రపక్షమయిన తేదేపాకు కూడా దక్కకుండా చేసారు.

 

కనుక ఇకనయినా తెలంగాణా బీజేపీ నేతలు తమ శక్తి సామర్ధ్యాలను సరిగ్గా అంచనా వేసుకోవడం నేర్చుకొంటే మంచిది. అలాగే వాపును చూసి బలుపు అనుకొని అతిశయం ప్రదర్శించడం కంటే, మిత్రపక్షమయిన తెదేపాను కూడా తమతో కలుపుకొనిపోగలిగితే ఇటువంటి పరాభవాలను తప్పించుకోవచ్చును. ఈ ఉప ఎన్నికలను ఒక గుణపాఠంగా భావించి, తెలంగాణా బీజేపీ నేతలు వారి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పినట్లుగా ఇప్పటి నుండే పార్టీని బలోపేతం చేసుకొంటూ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయడానికి తగిన అభ్యర్ధులను తయారు చేసుకోవడం మంచిది.