తెరాస గెలిచింది.. కానీ ఎందుకు చెమటోడ్చవలసి వచ్చింది?

 

వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలలో తెరాస అభ్యర్ధి పసునూరి దయాకర్ మొదటి రౌండ్ నుండి కూడా స్పష్టమయిన ఆధిక్యతను ప్రదర్శిస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు ప్రకటించిన ఓట్ల లెక్కింపు ఫలితాలలో ఆయనకు 3,15,154 ఓట్లు దక్కించుకొని 2,41,564 ఓట్ల ఆధిక్యత కనబరుస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు రౌండ్లు లెక్కింపు పూర్తయ్యి ఐదవ రౌండ్ కొనసాగుతోంది. చివరివరకు ఇదేవిధంగా సాగినట్లయితే బహుశః తెరాస అభ్యర్ధి పసునూరి దయాకర్ కనీసం 4-5లక్షల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించే అవకాశాలున్నాయి.

 

ఈ ఎన్నికలను తెరాస ప్రభుత్వ పరిపాలనకు రిఫరెండం అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రకటించింది. కానీ అప్పుడు తెరాస ఆ సవాలును స్వీకరించలేదు. పంట రుణాల మాఫీచేయకపోవడం, రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు తదితర అనేక సమస్యల పట్ల తెరాస ప్రభుత్వం చాలా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించింది కనుక ఆ కారణంగా తమ ప్రభుత్వం పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉండవచ్చని భయపడిన కారణంగానే కాంగ్రెస్ విసిరిన ఆ సవాలును అప్పుడు స్వీకరించలేదు. కానీ వరంగల్ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలలో తన మంత్రులను, నేతలను దింపి చాలా పకడ్బందీగా ఓట్లను రాబట్టుకొని భారీ మెజార్టీతో విజయమా సాధించబోతోంది కనుక ఇప్పుడు ఆ సవాలును స్వీకరిస్తూ, తమ ప్రభుత్వ పరిపాలనను మెచ్చుకొని ప్రజలు ఇచ్చిన బహుమతి ఈ విజయం అని గొప్పలు చెప్పుకోవచ్చును. ప్రజలు తమ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి మెచ్చుకొని ప్రజలు తమకు ఓట్లు వేసి గెలిపించారని తెరాస నేతలు చెప్పుకోవచ్చును. కానీ అవలీలగా గెలవవలసిన ఈ ఉప ఎన్నికల కోసం తామంతా ఇంతగా ఎందుకు చెమటోడ్చవలసి వచ్చిందనే విషయం గురించి తెరాస ప్రభుత్వం కొంచెం ఆలోచిస్తే మంచిది.