TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వరంగల్ సీటు బీజేపీకే?

Published on: Mon Jun 15, 2015 4:01PM

 

కడియం శ్రీహరి ఖాళీ చేసిన వరంగల్ యంపీ స్థానానికి త్వరలోనే ఉపఎన్నికలు జరగడం తద్యం కనుక రాజకీయ పార్టీలన్నీ అప్పుడే హడావుడి పడిపోతున్నాయి. అందరికంటే ముందు ప్రయత్నాలు మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఆదిలోనే అపశకునం ఎదురయింది. ఆ స్థానం నుండి మాజీ యంపీ జి.వివేక్ ను పోటీచేయమని కోరితే అందుకు ఆయన నిరాకరించడంతో గత ఎన్నికలలో ఓడిపోయిన రాజయ్యనే ఆ స్థానం నుండి పోటీచేయించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.

 

ఇక తెరాస అధికారంలో ఉంది కనుక సహజంగానే దానికి విజయావకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కనుక అభ్యర్ధులు కూడా చాలా మందే ఉంటారు. ప్రస్తుత పరిస్థితులలో వరంగల్ నుండి తెదేపా పోటీ చేయడం కంటే బీజేపీ పోటీ చేయడమే తెదేపా-బీజేపీలకు అన్నివిధాల మంచిది. పంతానికి పోయి పోటీ చేసి, ఒకవేళ తెరాస అభ్యర్ధి చేతిలో ఓడిపోయినట్లయితే, తెలంగాణాలో తెదేపాకి అది చావుదెబ్బ క్రింద పరిణమించే ప్రమాదం ఉంది. కనుక ఈ ఉపఎన్నికలలో తెదేపా పోటీ చేయకపోవడమే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కనుక తెదేపా వెనక్కి తగ్గి బీజేపీకి అవకాశం ఈయవచ్చును.

 

బీజేపీ అభ్యర్ధికి మద్దతు ఇచ్చి తెరాస అభ్యర్ధిని ఓడించగలిగినట్లయితే, తెరాస మీద ప్రతీకారం తీర్చుకొన్నట్లవుతుంది కూడా. గత ఏడాది కాలంగా రాష్ర్ట బీజేపీ నేతలు తెరాస ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నారు. అదే విధంగా మోడీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకొన్న తరువాత కూడా జాతీయ స్థాయిలో మంచి మార్కులే సంపాదించుకోగలిగింది. కనుక తెలంగాణా ప్రజలపై కూడా మోడీ ప్రభావం బాగానే ఉంటుందని భావించవచ్చును. కనుక వరంగల్ నుండి బీజేపీ పోటీ చేసి తన సత్తా చాటుకొనేందుకు ఉత్సాహం చూపవచ్చును. ఒకవేళ బీజేపీ అభ్యర్ధిని రంగంలో దింపినట్లయితే, తెరాస కేంద్రంతో సఖ్యత కోరుకొంటున్న కారణంగా పేరుకి ఒక డమ్మీ అభ్యర్ధిని నిలబెట్టి, బీజేపీ అభ్యర్ధి విజయానికి పరోక్షంగా సహకరించవచ్చును. లేదా ఒకవేళ ఓటుకు నోటు కేసులో కేంద్ర ప్రభుత్వం తమపై ఒత్తిడి తెచ్చినట్లయితే, బలమయిన అభ్యర్ధిని నిలబెట్టి తెదేపా-బీజేపీలను ఓడించి వాటి మీద ప్రతీకారం తీర్చుకొనే ప్రయత్నం చేసినా ఆశ్చర్యం లేదు.

 

ఇంకా ఉపఎన్నికకు షెడ్యూల్ కూడా విడుదల కాలేదు. కనుక ఈలోగా మారే రాజకీయ పరిస్థితులను బట్టి పార్టీల వ్యూహాలు, ఆలోచనలు కూడా మారవచ్చును.