'స్టేషన్' పోరులో విజేతకు క్యాబినెట్ బెర్త్?
Published on: Fri Feb 24, 2012 1:38PM
వరం
గల్: వరంగల్ జిల్లా రాజకీయ చరిత్రలో స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గానికి ఒక విశిష్టస్థానం ఉంది. ఈ స్టేషన్ ఒక్క బిజెపికి తప్ప ప్రధాన రాజకీయ పార్టీలన్నింటికీ ప్లాట్ ఫారంగా నిలిచింది. ఇక్కడినుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టినవారిలో ముగ్గురికి క్యాబినెట్ లో బెర్త్ లు లభించాయి. ఒకేస్థానం నుంచి ముగ్గురు మంత్రులు అయిన ఘనత ఒక్క స్టేషన్ ఘనపూర్ కే దక్కుతుంది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఆవిర్భావం తరువాత 1957లో బి. కేసవరెడ్డి (కాంగ్రెస్) మొదటిసారిగా గెలిచారు. 1962లో కమ్యూనిస్టుపార్టీ పక్షాన ఎస్ సివిమోహనరావు గెలుపొందారు.1967లో స్వాత్రంత్య అభ్యర్ధిగా లక్ష్యారెడ్డి గెలిచారు. 1972లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, జిల్లా రాజకీయాలను శాసించిన టి. హయగ్రీవాచారి ఈ నియోజకవర్గంనుంచే అసెంబ్లీలో అడుగుపెట్టి మంత్రి పదవిని అలంకరించారు. ఇది ఎస్సీలకు రిజర్వు అయిన తరువాత 1978, 1983 ఎన్నికల్లో రెండు సార్లు గోకా రామస్వామి కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచి మంత్రివర్గంలో మత్య్సశాఖ మంత్రిగా స్థానం పొందారు. 1985లో టిడిపి ,మొదటిసారిగా స్టేషన్ లో పాగావేసింది. అసెంబ్లీకి వెళ్లడానికి బి. రాజయ్యకు ఓటర్లు గ్ర్రీన్ సిగ్నల్ ఇచ్చారు.1989 ఎన్నికల్లో పరిస్థితి తల్లక్రిందులైంది. తిరిగి కాంగ్రెస్ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్దిగా భువనగిరి ఆరోగ్యం ఎన్నికయ్యారు.1994లో నియోజకవర్గం ప్రజలు టిడిపి సైకిల్ ను తిరిగి స్టేషన్ కు రానిచ్చారు. 1999లో సైతం ఇదేజరిగింది. ఈ రెండుసార్లు కడియం శ్రీహరి విజయం సాధించి మంత్రి పదవులు పొందారు. అయితే 2004 ఎన్నికల్లో టిఆర్ ఎస్ ప్రభంజనంలో భాగంగా ఆ పార్టీ అభ్యర్ధి విజయరామారావు ఈ నియోజకవర్గంలో గెలిచి మంత్రి పదవిని పొందారు. 2008లో ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన ఉదాశీన వైఖరికి నిరసనగా టి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో ఉపఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో విజయరామారావుపై కడియం శ్రీహరి గెలిచారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన టి. రాజయ్య గెలుపొందారు. ఇదే ప్రత్యేక తెలంగాణా అంశం నేపధ్యంగా ఆయన తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో అప్పుడు మళ్ళీ స్టేషన్ కు ఉపఎన్నిక అనివార్యమైంది.


