TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కోదండరామ్ అన్ని పార్టీలనూ ఏకం చెయ్యి కడియం

Published on: Sat Jan 7, 2012 1:05PM

వరంగల్: తమ పార్టీని ఎక్కువగా విమర్శించదలుచుకుంటే తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరాలని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకుడు కడియం శ్రీహరి సూచించారు. కోదండరామ్ తెరాస ఏజెంటుగా పనిచేస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. జెఎసి నాయకుడిననే విషయం మర్చిపోయి కోదండరామ్ తెలుగుదేశం పార్టీపైనే ఎక్కువ విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. కోదండరామ్ ఇంగిత జ్ఞానం కోల్పోయి తమ పార్టీపైనే విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. చిత్తుశుద్ధి ఉంటే కోదండరామ్ అన్ని పార్టీలనూ ఏకం చేయాలని, లేదంటే జెఎసి చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని ఆయన అన్నారు.

తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పాలకుర్తి సభను చూసైనా తెరాస నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెరాస, తెలంగాణ జెఎసి రెచ్చగొట్టి సాధించిందేమిటని, విద్యార్థులూ యువకులపై కేసులు పెట్టించారని ఆయన అన్నారు. దమ్ముంటే తెలంగాణ అభివృద్ధిపై తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు. తెలంగాణ ఉద్యమంతో శాసనసభ్యులను గెలిపించుకుని అవసరమైనప్పుడు కెసిఆర్ అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. తమ పార్టీని విమర్శించే హక్కు తెరాసకు లేదని ఆయన అన్నారు.