TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆద్యంతం ఉద్రిక్తతల నడుమ వరంగల్‌ చేరిన పోరుయాత్ర

Published on: Fri Jan 6, 2012 10:17AM

వరంగల్ : టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన రైతుపోరుయాత్ర ఆద్యంతం ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. ఆయన హైదరాబాద్‌ నుంచి బయలుదేరింది మొదలు అడుగడుగునా నిరసనలు, ఆందోళనలు, రాళ్లదాడులు ఎదురయ్యాయి. పోలీసుల లాఠీఛార్జ్‌లు, భాష్పవాయు ప్రయోగాలు చోటుచేసుకున్నాయి. పెంబర్తి చేరుకున్న బాబు కాన్వాయ్ని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దాంతో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు రాళ్లు రువ్వుతూ, కర్రలకు పనిచెబుతూ తెలంగాణవాదుల్ని అడ్డుకున్నారు. దాంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు బాబు కాన్వాయ్పై తెలంగాణవాదులు రాళ్లదాడి చేశారు. దాంతో జనగామలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాళ్లదాడిలో మీడియా ప్రతినిధులు గాయపడ్డారు.

నల్లగొండ జిల్లాలో రోడ్డుకిరువైపులా చంద్రబాబు యాత్రకు వ్యతిరేకంగా తెలంగాణవాదులు బ్యానర్లు కట్టి, నల్లజెండాలు ప్రదర్శించారు. నిరసనలకు భయపడిన తెలుగు తమ్ముళ్లు భువనగిరిలో బైపాస్‌ మీదుగా కాన్వాయ్‌ను ముందుకు తీసుకెళ్లారు. రాయగిరిలో తెలంగాణవాదులు కాన్వాయ్‌పై రాళ్లవర్షం కురిపించారు. స్వాగతం పలికేందుకు వచ్చిన తెలుగుతమ్ముళ్లను ఉద్యమకారులుగా భావించి కాన్వాయ్‌లో ఉన్న కార్యకర్తలు చితకబాదారు. ఈ సందర్భంగా కాన్వాయ్‌లో ఉన్న ఓ కార్యకర్త దగ్గర పోలీసులు రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. జనగామలో దాదాపు వెయ్యిమందికిపైగా తెలంగాణవాదులు కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. భారీగా రాళ్లవర్షం కురిపించారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్‌కు దిగారు. ప్రస్తుతం బాబు కాన్వాయ్‌ వరంగల్‌ జిల్లా లక్ష్మక్కపల్లివైపు దూసుకెళ్తోంది. పోలీస్‌ పహారాలో సాగుతున్న బాబుయాత్ర కాన్వాయ్‌లో 700వాహనాలు ఉన్నాయి.


కాగా, వరంగల్‌ జిల్లా కోర్టులో న్యాయవాదులు శుక్రవారం బంద్ పాటిస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాకను నిరసిస్తూ న్యాయవాదులు కోర్టు గేట్లకు తాళాలు వేసి, నిరసన తెలిపారు. ఇటు తొర్రూరులో ఆర్టీసి కార్మికులు బస్సులను నడపకుండా ఆందోళన చేపట్టారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.