TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఓరుగల్లులో టెన్షన్:ఉద్రిక్తతల మధ్య బాబు పాదయాత్ర

Published on: Fri Jan 6, 2012 8:13AM

వరంగల్: ప్రాణాలు ఎదురొడ్డి నిజాం రజాకార్లను ఎదిరించిన పాలకుర్తిలో మరోమారు యుద్ధవాతావరణం నెలకొంది. పోరాటాల ఖిల్లా వరంగల్ పోలీసుల చక్రబంథంలో చిక్కుకుంది. 'వరంగల్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో మీరు ఇక్కడ యాత్ర చేయడం అంత శ్రేయస్కరం కాదు' అని చంద్రబాబుకు వరంగల్ జిల్లా ఎస్పీ రాజేశ్‌కుమార్ సూచన చేశారు. 'నోటీసు ఏమీ అందలేదు. వరంగల్ జిల్లా పర్యటన యథాతథం అని టీడీపీ అధినేత చంద్రబాబు అంటున్నారు. అనివార్య కారణాల వల్ల బాబు రాలేకపోయినా.. 25 వేల మందితో పాదయాత్ర, 50 వేల మందితో బహిరంగ సభ నిర్వహించి తీరుతామని వరంగల్ జిల్లా టీడీపీ నేతలు అంటున్నారు. యాత్ర చేయించి తీరాలని టీడీపీ వర్గాలు.. ఎలాగైనా అడ్డుకుని తీరాలని టీఆర్ఎస్, జేఏసీ, ఇతర వర్గాల పంతాల మధ్య.. భారీ బందోబస్తు నడుమ వరంగల్ జిల్లాలో 14 కిలోమీటర్ల మేర పాదయాత్రకు రంగం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు వరంగల్ జిల్లా సరిహద్దు గ్రామమైన పెంబర్తికి చంద్రబాబు చేరుకుని పాలకుర్తి నియోజకవర్గంలోని లక్ష్మక్కపల్లి నుంచి పాదయాత్ర మొదలు పెట్టి 12కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలకుర్తి వరకు సాగిస్తారు. మార్గంలో చెన్నూరు, విస్నూరు గ్రామాల్లో పంట పొలాలను సందర్శించి రైతుల కష్టనష్టాలు అడిగి తెలుసుకుంటారు. సాయంత్రం నాలుగు గంటలకు పాలకుర్తిలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వరంగల్ జిల్లాకు చంద్రబాబు రాకకు నిరసనగా శుక్రవారం తెలంగాణ బంద్ పాటించాలని జేఏసీ పిలుపునివ్వగా, తమ అధినేతను అడ్డుకుని దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, అలాంటి శక్తులపై టీడీపీ కేడర్ ప్రతిదాడులు తప్పవని ఆ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులు భారీస్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజులుగా కొనసాగుతున్న తెలంగాణవాదుల అరెస్టుల పరంపర గురువారం మరింత ఊపందుకొంది.