వరంగల్లు రణరంగం..బాబు రాకముందే భగ్గు
Published on: Thu Jan 5, 2012 8:23AM
జనగా
మ: వరంగల్ జిల్లాలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శుక్రవారం పర్యటిస్తుండడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ జిల్లాల్లో చంద్రబాబు నాయుడు ఇప్పటివరకూ తన రైతుపోరు బాటను విజయవంతంగా చేసుకుంటూ వచ్చారు. ఇదే ఊపుతో వరంగల్ జిల్లా పోరుయాత్రను సక్సెస్ చేయాలని "తమ్ముళ్లు" ఉవ్విళ్లూరుతున్నారు. ఐతే తెరాస మాత్రం బాబు యాత్రకు బ్రేకులు వేసేందుకు సర్వశక్తుల్ని ఒడ్డుతున్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొ.కోదండరామ్, తెరాస నేత హరీశ్‌రావులైతే వరంగల్‌లో మకాం వేసి చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో బాబు పర్యటనకు వారం రోజుల ముందు నుంచే పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. సమైక్యపాలకులకు మద్దతునిచ్చే చంద్రబాబు జిల్లాకు రాకూడదంటూ వరంగల్ జిల్లా బంద్‌కు సైతం పిలుపునిచ్చారు. తెరాస - తెదేపాల్లో పరస్పరం పట్టుదల పెరిగిపోయి మాటలదాడికి దిగుతున్నారు. చంద్రబాబు నాయుడు వరంగల్‌లో అడుపెట్టి చూడమనండి అని తెరాస అంటుంటే.. బాబుపై ఈగ వాలితే కోదండరామ్, తెరాస నాయకులు రోడ్లపై తిరగలేరని తెదేపా నాయకులు హెచ్చరిస్తున్నారు.
కాగా, బుధవారం జనగామ జెఎసి శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం ప్రకటించిన టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీష్‌రావు, వినయ్‌భాస్కర్, సత్యనారాయణ తదితరులను పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు చేసి రాత్రి 9 గంటల తర్వాత వదిలి పెట్టారు. బాబు యాత్రను అడ్డుకునేందుకు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పల్లెబాట పేరుతో ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారనే అనుమానంతో కొంతమంది టిఆర్‌ఎస్ నాయకులను తాము ముందస్తు అరెస్టు చేసినట్లు జనగామ డిఎస్పీ ఎస్. చైతన్య కుమార్ తెలిపారు.లింగాలఘణపురం పోలీస్ స్టేషన్‌కు ఎమ్మెల్యే బృందం వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే తాము వారిని అడ్డుకుని అరెస్టుచేసినట్లు డిఎస్పీ వెల్లడించారు. ఈ సంఘటనలో తనతో పాటు తమ సిఐ గణపతి జాదవ్, ఎస్సై కూడా గాయాలయ్యాయని తెలిపారు.


