జగన్ గజదొంగ.. వైఎస్సార్ నీటిదొంగ.. ముదిరిన వాటర్ వార్..
Published on: Tue Jun 22, 2021 10:47PM
జగన్ గజదొంగ అంటూ ఏపీ సీఎంపై తెలంగాణ మంత్రి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అందులోనూ ఆ మంత్రి సీఎం కేసీఆర్‌కు బాగా సన్నిహితుడనే పేరుంది. ఆ మినిస్టర్ అలా అన్నాడంటే.. కేసీఆరే అలా అనిపించి ఉంటాడని అంటున్నారు. జగన్‌రెడ్డిని తెలంగాణ మంత్రి వ్యక్తిగతంగా విమర్శించాడంటే.. ఇక ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయని చెబుతున్నారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం ముందుముందు ఏలాంటి టర్న్ తీసుకుంటుందోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య మరోసారి జల వివాదం తలెత్తింది. ఇరు రాష్ట్రాల మంత్రులు ప్రాజెక్టుల విషయంలో మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఏపీ మంత్రులు కాస్త నెమ్మదిగానే మాట్లాడుతున్నా.. తెలంగాణ మినిస్టర్స్ మాత్రం తెగ రెచ్చిపోతున్నారు. మా వాటా మేం వాడుకుంటే తప్పేంటంటూ ఏపీ మంత్రి అనిల్‌కుమార్ ప్రశ్నిస్తే.. అందుకు తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా, మరో మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఏకంగా ఏపీ సీఎం జగన్‌పైనే డైలాగ్ గన్ ఎక్కుపెట్టారు. జగన్‌రెడ్డిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నీటిదొంగ అయితే.. నేటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గజదొంగలా మారాడంటూ కామెంట్స్ చేయడం సంచలనం సృష్టిస్తోంది.
ఏపీ సర్కారు పోతిరెడ్డిపాడు- రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో దూకుడు పెంచింది. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం కలకలంగా మారింది. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఆనాడు పొతిరెడ్డి పాడు ద్వార నీటిని దొంగతనంగా తరలించుకుపోయి నీటి దొంగగా మారడని.. ప్రస్థుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం అనుమతి లేని ప్రాజెక్టులను నిర్మిస్తూ.. గజదొంగగా మారడని మండిపడ్డారు ప్రశాంత్‌రెడ్డి.
తెలంగాణలోని మహబుబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలను ఎండగట్టాలని ప్రశాంత్‌రెడ్డి పిలుపిచ్చారు. ఏపీ పాలకులు అనుమతి లేని ప్రాజెక్టులను దొంగతనంగా నిర్మిస్తున్నారని.. అందుకు సంబంధించిన సాక్ష్యాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తెప్పించారని త్వరలో గ్రీన్ ట్రిబ్యునల్‌తో పాటు ప్రధాని మోదీకి సైతం ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ప్రాజెక్టులను వెంటనే ఆపకపోతే పోరాటం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రా ప్రజలందరు తెలంగాణకు వ్యతిరేకులని, లంకలో పుట్టిన వారంతా రాక్షసులేనని విధ్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.
మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆంధ్రా ప్రజలను మంత్రి లంక వాసులతో పోల్చడంపై నిరసన వ్యక్తం చేశారు. ఎప్పుడో జరగాల్సిన ఆర్‌డీఎస్ కుడి కాలువ పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కృష్ణ, గోదావరి ట్రిబ్యునల్ నుండి ఇష్టం వచ్చినట్టి నీటిని చౌర్యానికి పాల్పడుతుందని కర్నూలు టీడీపీ నేతలు ఆరోపించారు. తమకు రావాల్సిన 4 టీఎంసీల నీటి వాటా ప్రకారం టెండర్ వేసి కుడి కాలువ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇంత జరుగుతున్నా.. తెలంగాణ మంత్రులు అంతేసి మాటలు మాట్లాడుతున్నా.. వైసీపీ నేతలు మౌనం వహిస్తుండటంపై మండిపడుతున్నారు ఏపీ ప్రజలు.
మరోవైపు.. మాటలతో పాటు చేతలతోనూ ఏపీపై అటాక్ చేస్తోంది తెలంగాణ సర్కారు. తాజాగా, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పోతిరెడ్డిపాడు విస్తరణ పనులపై ఫిర్యాదు చేసింది. ఎన్జీటీ స్టే విధించినా పనులు కొనసాగుతున్నాయని, కృష్ణా బోర్డు వాటిని అడ్డుకోలేకపోయిందని తెలంగాణ ప్రభుత్వం కంప్లైంట్ చేసింది. డీపీఆర్ కోసం సన్నాహకాలంటూ ప్రాజెక్టు పనులను కొనసాగిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు కృష్ణా బోర్డు కనీసం నిజనిర్ధారణ కమిటీని కూడా పంపలేకపోయిందని లేఖలో తప్పుబట్టింది. ఏపీ చర్యలతో తెలంగాణలో కృష్ణా బేసిన్‌లో ఉన్న కరవు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలపై ప్రభావం పడుతుందని తెలంగాణ కేబినెట్ అభిప్రాయపడిన విషయాన్ని లేఖలో తెలిపింది. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను తక్షణమే ఆపాలని లేఖలో కోరింది తెలంగాణ సర్కారు. ఇలా, వరుస పరిణామాలు, తూటాల్లాంటి మాటలు చూస్తుంటే.. రెండు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ మళ్లీ మొదలైనట్టే ఉంది. ఏపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో.. అది ఏ పరిణామాలకు దారి తీస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.


