TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

దుబ్బాకలో చతికిల పడినా మారని కాంగ్రెస్ అగ్రనేతల తీరు..

Published on: Thu Nov 12, 2020 9:51AM

దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధికి కేవలం 22196 ఓట్లు రావడంతో మూడో స్థానంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. అయినా తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ ప్రవర్తనను ఏమాత్రం మార్చుకోవడం లేదు. తాజాగా ఖమ్మంలో జరిగిన ఒక సమావేశంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, రేవంత్‌రెడ్డి మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. టిపిసిపిఎల్పి నాయకుడు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఖమ్మంలో చేపట్టిన "రైతు పొలికేక" సభలో ఇద్దరు నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఈ సభలో వీహెచ్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వాలని అన్నారు. దీంతో సభలోని కొందరు కార్యకర్తలు రేవంత్‌కు సపోర్ట్ గా నినాదాలు చేశారు. అయితే వాటిని ఏమాత్రం పట్టించుకోని వీహెచ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ఎన్నికల టైం లో ఇతర పార్టీల నుండి వచ్చిన వారిని చేర్చుకుని టికెట్ ఇవ్వడం సరికాదని, ఎప్పటి నుండో పార్టీని నమ్ముకుని ఉన్న వారికే టికెట్ ఇవ్వాలని అన్నారు.
 

అయితే విహెచ్ ప్రసంగం తరువాత రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వీహెచ్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఏకంగా అమ్ముడుపోయే నేతలు ఉన్నారని, అలాంటి వారిని గుర్తించి పార్టీనుండి ఏరివేయాలని అన్నారు. అంతేకాకుండా పార్టీలో డిపాజిట్లు రాని నాయకుల పెత్తనం కూడా కొనసాగుతోందని, ఇకపై ఇటువంటి పొరపాట్లు జరగవని అధిష్ఠానం కూడా తేల్చి చెప్పిందని.. వీహెచ్‌ను ఉద్దేశించి రేవంత్ అన్నారు. ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారన్నది ముఖ్యం కాదని, ఎక్కడి నుండి వచ్చినా పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే నాయకులనే ప్రజలు గెలిపిస్తారని రేవంత్ ఈ సందర్భంగా అన్నారు. రేవంత్, వీహెచ్ వ్యాఖ్యలతో సభలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.