ఏపీలో కలకలం.. స్కూల్ బయట వీవీపాట్ స్లిప్పుల కట్టలు

 

సార్వత్రిక ఎన్నికల వేళ ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు, ఈసీ పనితీరుపై అసంతృప్తితో ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు జాతీయ స్థాయిలో పోరాటానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు ఈసీకి పెద్ద తలనొప్పి వచ్చి పడింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో స్ట్రాంగ్ రూమ్స్‌లో ఉండాల్సిన వీవీపాట్ స్లిప్పులు ఆరుబయట కనిపించడం సంచలనం రేపుతోంది. ప్రభుత్వ పాఠశాల బయట కుప్పలుకుప్పలుగా స్లిప్పులు కనిపించండంతో ఓ విద్యార్థి మీడియాకు సమాచారం అందించారు. దీంతో ఒక్కసారిగా దుమారం రేగింది. అయితే ఆ స్లిప్పులు మాక్ పోల్ చేసిన స్లిప్పులు కావొచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. కానీ.. మాక్ పోల్ స్లిప్పులైతే పెద్ద మొత్తంలో స్లిప్పులు ఎందుకు ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ మాక్ పోల్ చేసిన స్లిప్పులయినప్పటికీ వాటిని భద్రపరచాల్సి ఉంటుంది. కానీ స్లిప్పులు ఇలా ఆరుబయట దర్శనమిచ్చాయి. కలెక్టర్ ద్వారా విషయాన్ని తెలుసుకున్న ఆర్డీవో స్కూల్ ప్రాంగణానికి వచ్చి పరిశీలించారు. పలు కవర్లలో వారికి వీవీపాట్ స్లిప్పులు కనిపించాయి. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ అధికారుల వివరణ కోరారు. అసలే ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఘటన ఇంకెంత దుమారం రేపుతుందో చూడాలి.