TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జ‌గ‌న్‌కు ద‌మ్ములేదా? మోదీ అంటే భ‌య‌మెందుకు? ఉండ‌వ‌ల్లి వాయింపు..

Published on: Wed Feb 9, 2022 5:15PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలను తెలంగాణలో ఒక్క బీజేపే మినహా మిగిలిన అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. రాజకీయ పార్టీలే కాదు, సామాన్య జనం కూడా స్పందిస్తున్నారు. కానీ, ఆంధ్ర ప్రదేశ్’లో మాత్రం ఇటు రాజకీయ నాయకులు, అటు సామాన్య ప్రజలు, మేథావులు ఎవరూ పెదవి విప్పడం లేదు. బహుశా స్పందిస్తే ఏ చిక్కులు వస్తాయో అనే భయంతో కావచ్చు రాజకీయ నాయకులు గప్ చుప్ అయి పోయారు. 

అయితే, ప్రధాని రాజ్యసభలో చెప్పిన విషయాన్నే గత ఏడేళ్ళుగా మీడియాలో చెపుతూ, న్యాయపోరాటం కూడా చేస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం ఇంతకాలానికి తమ వాదనకు బలం చేకూరిందని, ఏకంగా ప్రధాన మంత్రి నుంచే మద్దతు లభించడంతో ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం కళ్లు తెరవాలని అన్నారు. పార్లమెంట్‌లో ప్రధాని అన్న మాటలు వంద శాతం నిజం అని కితాబు నిచ్చారు. విభజన బిల్లు లోప భూయిష్టంగా ఉందని.. చర్చ లేకుండా ఆమోదించారని ఉండవల్లి విమర్శించారు. లోక్ సభ’లో తలుపులు మూసేసి ప్రజాస్వామ్య విరుద్ధంగా విభజన చేశారన్న ప్రధాని మోడీ మాటలు అక్షర సత్యమని, ఆరోజు సభలో ఉన్న ఉండవల్లి స్పష్టం చేశారు.  

ప్రజలు భారీ మెజారిటీతో జగన్ రెడ్డికి అధికారం అప్పగించడంతో పాటుగా, 22 మంది ఎంపీలను గెలిపించారని గుర్తు చేసిన‌ ఉండవల్లి.. ప్రధాని స్వయంగా ఏపీకి అన్యాయం జరిగిందని అంగీకరించిన నేపధ్యంలో, వైసీపీ ఎంపీలు విభజన అంశాలపై ప్రస్తావించాలని ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని కోరారు. ఇప్పటికీ ఎంపీలు, ఏపీ ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో రాష్ట్రాన్ని ఎవరూ పట్టించుకోరని అన్నారు.  ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు అన్నీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి భయపడుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. జగన్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మౌనంగా ఉంటే ముందుతరాలు దారుణంగా నష్టపోతాయి.. ఆంధ్రాకు ఏం చేసినా అడిగేవాడు లేడని అనుకుంటారని ఉండ‌వ‌ల్లి అన్నారు.

"జరిగిన నష్టంపై కోర్టుకీ వెళ్లరు.. పార్లమెంట్‌లోనూ అడగరు. ఇంత దమ్ములేని పరిస్థితికి మనం వచ్చేశామా? ఓ నోటీసు ఇవ్వడానికి దమ్ములేదా? పార్లమెంట్‌లో చర్చ జరిగితే రాష్ట్రాల విభజన ఎలా జరగాలి.. ఎలా జరిగిందీ.. ఏమిటీ రాజకీయ లబ్ధి.. ఎందుకు ముంచేశారు.. ఇలా అన్నీ బయటపడతాయి. జగన్‌ గారూ.. మీరు అడిగిన దానికంటే ప్రజలు ఎక్కువ సీట్లే ఇచ్చారు. మోదీకి పాదనమస్కారం చేస్తూనే.. అయ్యా మీరన్న మాటే కదా.. దానిపైనే చర్చిద్దాం అని అడగండి. వీళ్లూ అడుగుతారు అని తెలుస్తుంది. అప్పుడు అన్నీ బయటకొస్తాయి" అని ఉండవల్లి అన్నారు.  

"ఉద్యోగుల విషయంలో ఏపీలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. జీతాలు పెరిగాయో.. తగ్గాయో కూడా అర్థం కాని పరిస్థితి. అశుతోష్‌ మిశ్రా నివేదిక బయటపెట్టడానికి ఏంటి అభ్యంతరం? ఫిబ్రవరిలోనే విద్యుత్‌ కోతలు ఉంటే ఏప్రిల్‌, మేలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. జగన్‌ పెద్ద వ్యాపారవేత్త.. వ్యాపారులు వ్యాపారం కోసమే ఆలోచిస్తారు. రాష్ట్రం విషయంలో జగన్‌ కూడా ఆ తరహాలోనే ఆలోచిస్తున్నారని అనుకుంటున్నాను. జగన్‌ అధికారంలోకి వచ్చారు.. పోలవరం ఎలాగైనా పూర్తవుతుందని అనుకున్నాం. కానీ, పూర్తి కావట్లేదు. జనం మద్దతు ఉన్నప్పుడు జగన్‌ ఎందుకు వెనుకాడుతున్నారో అర్థం కావట్లేదు" అని ఉండవల్లి ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు చేశారు. ఉండ‌వ‌ల్లి వ్యాఖ్య‌ల‌పై ఏపీ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.