TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వీఆర్ఎస్‌కు ఎగ‌బ‌డుతున్న ఏపీ ఉద్యోగులు.. జ‌గ‌న‌న్న ఎఫెక్ట్ మామూలుగా లేదుగా!

Published on: Thu Dec 23, 2021 3:17PM

గ‌వ‌ర్న‌మెంట్ జాబ్ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దువుతారు. ఉద్యోగం రాగానే హ‌మ్మ‌య్యా అని రిలాక్స్ అవుతారు. ప్ర‌భుత్వ ఉద్యోగం అంత ధీమా మ‌రే వ్యాపార‌మూ, జాబూ ఇవ్వ‌దు. గ‌వ‌ర్న‌మెంట్ జాబ్ ఉంటే.. పెళ్లి సంబంధాల‌కూ డిమాండ్ పెరుగుతుంది. నెల నెలా ఠంచన్‌గా జీతం.. సెల‌వులు.. జాబ్ సెక్యూరిటీ.. రిటైర్ అయ్యాక పెన్ష‌న్‌.. అన్నీ అనుకూల‌త‌లే. కానీ.... ఏపీలో మాత్రం అలా కాదు. స‌మ‌యానికి శాల‌రీ వ‌స్తుందో రాదో తెలీదు. ఈఎమ్ఐలు ఉంటే ఇక అంతే సంగ‌తి. ఉద్యోగుల‌తో ఎలాంటి ప‌నులు చేయిస్తారో తెలీదు. ఏమేం టార్గెట్లు పెడ‌తారే అర్థం కాదు. ఇక పీఆర్సీ ఇస్తారో లేదో.. ఇస్తే పెర‌గాల్సిన జీతం త‌గ్గేలా ఉందంటున్నారు. అటు సీపీఎస్ ర‌ద్దు ఎప్ప‌టికి అవుతుందో ఏమో తెలీదు. ఇక ఉద్యోగ సంఘాల్లో గ్రూపులు. రాజ‌కీయాలు. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ సీఎం అయ్యాక‌ ఏపీలో ప్ర‌భుత్వ ఉద్యోగమంటేనే వెగ‌టుపుడుతోంద‌ని అంటున్నారు. అందుకే, ఐదేళ్ల స‌ర్వీస్ ఉన్న‌వాళ్లంతా వీఆర్ఎస్‌కు ఎగ‌బ‌డుతున్నార‌ని తెలుస్తోంది. ఇన్నాళ్లూ చేసింది చాలు.. ఇక మాకీ ఉద్యోగం వ‌ద్దంటూ స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణను తీసుకుంటున్నార‌ట చాలా మంది ఉద్యోగులు.  

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున స్వచ్చంద పదవీ విరమణ చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న చాలా మంది ఇంజినీర్లు వీఆర్ఎస్‌కు ముందుకొస్తున్నారు. ఇప్పటికి వంద మందికిపైగా దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. విద్యుత్ సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు తగ్గించాలనే ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ప్రక్రియ మొద‌లైందని.. అదే జ‌రిగితే ఉద్యోగులు భారీ మొత్తంలో పదవీ విరమణ ప్రయోజనాలు పోగొట్టుకుంటారని తెలుస్తోంది. పెన్షన్ కూడా సగానికి సగం తగ్గిపోనుంది. అలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే.. వెంట‌నే ఉద్యోగం నుంచి వీఆర్ఎస్ తీసుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. లేదంటే, భారీగా న‌ష్ట‌పోక త‌ప్ప‌ద‌ని విద్యుత్‌ ఉద్యోగులు భావిస్తున్నారు. 

ఇష్టం లేక‌పోయినా వీఆర్ఎస్‌కే మొగ్గుచూపుతున్నార‌ట చాలామంది. ఇప్ప‌టికే ఒక‌టో తారీఖున జీతం వ‌చ్చే ప‌రిస్థితి ఎప్పుడో పోయింది. పీఆర్సీతో జీతం మ‌రింత త‌గ్గుతుంద‌ని తెలుస్తోంది. నెల నెలా ఈ శాల‌రీ టెన్ష‌న్ కంటే.. మంచి ప్రైవేట్ కంపెనీ చూసుకొని చేరిపోతే.. బెట‌ర్ అనే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట సీనియ‌ర్ ఉద్యోగులు. త‌మ అనుభ‌వానికి ప్రైవేట్ సంస్థ‌ల్లో ఇక్క‌డికంటే మంచి జీతం.. అది కూడా టైమ్‌కి వ‌స్తుంద‌ని.. అందుకే వంద‌లాది మంది ఉద్యోగులు వీఆర్ఎస్‌కు అప్లై చేస్తున్నార‌ని అంటున్నారు. జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వంపై న‌మ్మ‌కంలేక.. ప్ర‌భుత్వ‌ ఉద్యోగులు ఇలా ఉద్యోగాలు వీడేందుకు పోటీప‌డుతుండ‌టం బ‌హుషా మ‌రే రాష్ట్రంలోనూ ఉండ‌క‌పోవ‌చ్చు.