సర్జరీలో సీక్రెట్..!

అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ భర్త ఎం నటరాజన్‌కు కొంతకాలం క్రితం ఆరోగ్యం విషమించింది. కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలతో ఆయన గత కొద్దిరోజులుగా చెన్నైలోని గ్లెనీగ్లెస్ గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు అవయవాలు మార్పిడి చేయాలని లేకపోతే మనిషి దక్కడం కష్టమని వైద్యులు సూచించడంతో కుటుంబసభ్యులు అందుకు అంగీకరించారు. దీంతో 74 ఏళ్ల నటరాజన్‌కు ఆ వయసులో ఎంతో క్లిష్టమైన కిడ్నీ, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీని వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. అయితే, ఇక్కడే కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. 20 ఏళ్లు కూడా నిండని ఓ కుర్రాడు అనుమానాస్పద స్థితిలో ఆసుపత్రికి రావడం, బ్రెయిన్‌డెడ్ అయిన అతన్నుంచి ఆర్గాన్స్‌ సేకరించి..నటరాజన్‌కు అమర్చడంపై వివాదం రేగింది. ఈ క్రమంలో అందరి వేళ్లు మన్నార్ గుడి మాఫియా మీదకే వెళ్తున్నాయి.

 

శశికళ స్వగ్రామం మన్నార్ గుడి. ముగ్గురు సోదరులతో కలసి నివసించే చిన్నమ్మది ఉమ్మడి కుటుంబం.. ఆ వూళ్లోనే పెద్ద కుటుంబం. ఎప్పుడైతే శశి.. జయలలితకు దగ్గరైందో మన్నార్‌గుడిలో ఉండే ఆమె కుటుంబసభ్యులతో పాటు సమీప బంధువులంతా కట్టకట్టుకొని పోయెస్ గార్డెన్‌లో వాలిపోయారు. అమ్మ అధికారాన్ని అడ్డుపెట్టుకొని వీరంతా పార్టీలో, ప్రభుత్వంలో పట్టు సంపాదించారు. బదిలీలు, పైరవీలు, లైసెన్సులు ఇలా ఏం కావాలన్నా ఈ మాఫీయా చేసి పెట్టగలదు. అంతేందుకు ఏకంగా ఐఏఎస్‌లను సైతం బదిలీ చేయగల పవర్ వీరికి ఉండేదట.

 

ఈ మాఫియా కమాండర్ శశికళ భర్త ఎం. నటరాజన్. అయితే మన్నార్‌గుడి మాఫియా ఆగడాలు రోజు రోజుకి పెరుగుతుండటంతో జయలలిత కన్నెర్ర చేశారు. వీరిలో కొంతమందిని జైలుకు సైతం పంపించారు. మధ్యలో మళ్లీ రాజీ కుదిరినా, మన్నార్ గుడి మాఫియాను పూర్తిగా ఆమె క్షమించలేక పోయారు.  2011లో శశికళ మంది మార్బలాన్ని మొత్తం తరిమేశారు. అయితే, కొంతకాలం తర్వాత శశికళను తిరిగి దగ్గరికి చేర్చుకున్నారు. అయితే అనారోగ్య కారణాలతో జయ అపోలో ఆస్పత్రిలో చేరడం.. 74 రోజుల పాటు చికిత్స జరిగినా.. ఆ సమయంలో శశికళ తప్ప మరో వ్యక్తికి అమ్మ దగ్గరికి అనుమతి లభించకపోవడం తావివ్వడం... తర్వాత అమ్మ మరణించడం ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం లేదు.. ఈ వ్యవహారంలో తెర వెనుక మన్నార్ గుడి మాఫియా ఉందనేది ఎంతో మంది వాదన. జయ మరణం తర్వాత పార్టీని, ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకునేందుకు మన్నార్ గుడి గ్యాంగ్ చేయని ప్రయత్నం లేదు. వీరి కుట్రలను త్వరగానే అర్థం చేసుకున్న అన్నాడీఎంకే నేతలు ఈ గ్యాంగ్‌ను బయటకు పంపేశారు.

 

సరే ఈ సంగతి పక్కనబెట్టి నటరాజన్ సర్జరీ విషయానికి వస్తే. కీరమంగళం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్తీక్ అనే యువకుడిని చికిత్స నిమిత్తం తంజావూరు నుంచి ఎయిర్ అంబులెన్స్‌లో చెన్నైలో నటరాజన్ చికిత్స పొందుతున్న గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే కార్తీక్ అప్పటికే బ్రెయిన్ డెడ్‌ అయినట్లు ప్రకటించిన వైద్యులు అనంతరం అవయవ దానం గురించి తెలుపగా... అందుకు కుటుంబసభ్యులు అంగీకారం తెలిపారు. దీనిలో భాగంగా అతని గుండె, కిడ్నీలు, లివర్, ఉపిరితిత్తులను సేకరించిన వైద్యులు లివర్, కిడ్నీలను 74 ఏళ్ల వ్యక్తికి, గుండెను 43 ఏళ్ల వ్యక్తికి, ఉపిరితిత్తులను 62 ఏళ్ల వ్యక్తికి కేటాయించారు.

 

వీరిలో 74 ఏళ్ల వ్యక్తి నటరాజనే అనేది అందరి అభిప్రాయం. అయితే కార్తీక్‌ను గ్లెనెగిల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రికి తరలించిన తీరుపైనే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓ పేద యువకుడి కుటుంబం ఎయిర్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేసుకుని, గ్లెనెగిల్స్ ఆసుపత్రికే ఎందుకు తీసుకువెళ్లాలని భావించింది..? ఎయిర్ అంబులెన్స్‌కు ఖర్చులను ఎవరు భరించారు..? ఆర్గాన్ షేరింగ్ నెట్‌వర్క్‌ నిబంధనల ప్రకారం ఆర్గాన్ షేరింగ్ రిజిస్ట్రీలో అందరికన్నా పైన నటరాజన్ పేరు ఎలా వచ్చింది..? ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలకు.. సమాధానం ఒక్క మన్నార్ గుడి మాఫియానే అని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. లేదంటే ఈ సర్జరీ కూడా జయకు జరిగిన రహస్య చికిత్సలాగానే ఇది కూడా ఒక మిస్టరీలాగా మిగిలిపోతుందా అనేది కాలమే నిర్ణయించాలి.