TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కన్ను పడితే కొల్లగొట్టడమే? జగన్ పాలనలో ఇదే స్పెషల్.. 

Published on: Fri Jun 11, 2021 6:22PM

ఖరీదైన భూములు, విలువైన ఆభరణాలు ఉన్నాయని తెలిస్తే..ఆల్సేషియన్ డాగ్స్ లా చుట్టుముట్టేస్తారు. అవి ఏడుకొండలవాడివైనా..సంస్థానాధిపతులవైనా.. వారి ఆస్తులపైనా కన్నేసిన కొందరు దాని కోసం దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ.. వారి సొంత స్క్రిప్టును నడిపిస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఇది స్పష్టంగా కనపడుతోంది. గజపతిరాజుల సంస్థానంలో వారసుల పేరుతో మొదలైన దోపిడీ ప్రస్థానం.. ఇప్పుడు సుజయ వంశస్తులపైనా కొనసాగే అవకాశం కనపడుతోంది.
గతంలోని వారు తప్పులు చేశారా..ఒప్పులు చేశారా అనేది పక్కన పెడితే... వారి నుంచి ఆస్తులను ఏదో ఒక పేరుతో లాక్కుని.. అవి ప్రభుత్వం కోసం కాకుండా.. తమ సొంతానికి ఉపయోగపడేలా ప్లాన్ చేస్తున్నారని వైసీపీ నేతలపై ఆరోపణలు వస్తున్నాయి. 

ఇప్పుడు తాజాగా సుజయ రంగారావు వర్సెస్ బొత్స సత్యనారాయణ ఎపిసోడ్ లో అదే కనపడుతుందని అంటున్నారు.వేణుగోపాలస్వామి గుడి ఆస్తులను, ఆభరణాలకు అర్చకులకు ఉన్నపవర్ ను జాయింట్ పవర్ గా మార్చారు మాజీ మంత్రి సుజయ రంగారావు. గతంలో ఆస్థానం పరిధిలో ఉన్నప్పటికీ..ఇప్పుడా గుడి దేవాదాయశాఖ పరిధిలోకి వస్తుంది. దేవాదాయశాఖ పరిధిలో ఉన్నగుడికి చెందిన ఆస్తులు, ఆభరణాలపై ఇంకా పూర్వపు రాజవంశీయుల పెత్తనం ఎలా కొనసాగుతుందని.. ఇప్పుడే ఆ విషయం కొత్తగా తెలిసినట్లుగా మంత్రి బొత్స ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తమదే కాబట్టి.. మంత్రి వెల్లంపల్లి ద్వారా ఒక ప్రత్యేకాధికారితో విచారణకు కూడా ఆదేశించారు.

ఇదంతా వేణుగోపాలస్వామి గుడి ఆస్తులను, విలువైన భూములను సుజయ రంగారావు బారి నుంచి కాపాడుతున్నట్లు బిల్డప్ ఇస్తారు. కాని వాస్తవంలో..ఆయన పట్టు నుంచి తప్పించి.. వీరి పట్టులోకి తెప్పించుకోవడమే అసలు లక్ష్యం.  అదే జరుగుతోందని సుజయ రంగారావు అనుచరులు ఆరోపిస్తున్నారు.
సంచయిత గజపతిరాజును ఎంట్రీ చేయించి.. గజపతిరాజుల సంస్థానానికి చెందిన భూములపై ఎలా కన్నేశారో.. వాటిని ఎలా కొల్లగొట్టాలని చూస్తున్నారో ఇప్పటికే కనపడుతోంది. సంచయితే వారసురాలంటూ ప్రభుత్వం బుల్ డోజ్ చేసి సింహాచలం దేవస్థానానికి ఛైర్మన్ గా రాత్రికి రాత్రే చేసేశారు. ఆ తర్వాత వారి కింద ఉన్న ఒక స్కూల్ ను కూడా మూయించి.. ఆ భూములను ప్రైవేటువారికి కట్టబెట్టే ప్రాసెస్ మొదలెట్టారు. సింహాచలం పుణ్యక్షేతం క్రింద ఉన్నభూములను కూడా వేలం వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ కూడా లీగల్ కేసులు వేయడం వలనే...కోర్టుల్లో ఉండటం వలనే ఆగాయి. లేదంటే ఈపాటికి క్లీన్ వాష్ చేసేసేవారని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇలా విలువైన ఆస్తులు .. అవి భూములైనా..నగలైనా సరే..కొల్లగొట్టడానికి ఎలాంటి వివాదాలు అయినా రేపుతున్నారని వైసీపీపై టీడీపీ మండిపడుతోంది. ఆఖరుకు ఒక టైములో టీటీడీకి చెందిన భూములను కూడా అమ్మాలని ఏకంగా బోర్డులోనే ప్రతిపాదన పెట్టి..విమర్శలు రావడంతో వెనక్కు తగ్గారు.