TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రజా సమస్యలు గాలికి.. ప్రజాప్రతినిథులు గాల్లోకి!

Published on: Sat Apr 12, 2025 11:30AM

రోమ్ నగరం తగలబడి పోతుంటే ఇటలీ చక్రవర్తి ఫీడెల్ వాయించుకున్నారట.... ఇదో పాతకాలపు సామెత. ఇప్పుడు విశాఖలోని కొందరు కార్పొరేటర్లను చూసి ప్రజలు ఆ సామెతను గుర్తు చేసుకుంటున్నారు. ప్రధానంగా  తెలుగుదేశం,  వైసీపీకి చెందిన కార్పొరేటర్లు అత్యధిక శాతం మంది విహార యాత్రలకు వెళ్లారు. అది కూడా ఏడాది కాలం గడువున్న మేయర్ పీఠం కోసం.  

విశాఖ కార్పొరేషన్ తాజా కౌన్సిల్ ఏర్పాటై నాలుగేళ్లు గడిచింది. వైసీపీ   హయాంలో ఎన్నికలు జరగడంతో అన్ని రకాల అండదండలతో ఆ పార్టీ మేయర్ గా గొలగాని హరి వెంకట కుమారి ఎన్నికయ్యారు. కానీ కార్పొరేషన్ పై ఆమెకు పెత్తనం లేకుండా వైసీపీ పెద్దలు విజయసాయిరెడ్డి, వై వి సుబ్బారెడ్డి వ్యవహరించారు. కౌన్సిల్లో కూడా ఆ పార్టీకి చెందిన డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీను లాంటి నాయకులు పెత్తనం కొనసాగింది. ఒక సమయంలో అప్పటి ఎంపీ విజయ్ సాయి రెడ్డి అండతో జీవీఎంసీ కమిషనర్ సృజన కనీసం మేయర్ ను పట్టించుకోని పరిస్థితి కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. దీంతో సొంత పార్టీతో పాటు తెలుగుదేశం,  బిజెపి జనసేన కార్పొరేటర్ ల్లో కూడా చాలా వరకు అసంతృప్తి ఉంది.

ఈ దశలో నిబంధనల ప్రకారం నాలుగేళ్ల తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంది. దీంతో కూటమికి చెందిన కార్పొరేటర్లు ఇటీవల జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం లేఖను ఇచ్చారు.  దీంతో ఒక్కసారిగా వైసిపి శిబిరంలో హడావుడి మొదలైంది. ఇటీవల జరిగిన ఎన్నికలకు ఆరు నెలల నుంచి విశాఖకు పెద్దదిక్కుగా మారిన బొత్స సత్యనారాయణ ఈ వ్యవహారాన్ని తన భుజంపై వేసుకున్నారు. ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు జారిపోకుండా ప్రత్యేక శిబిరానికి తరలించారు. ముందు బెంగళూరు వెళ్ళిన ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు ఆ తర్వాత కొలంబో కూడా ప్రయాణం కట్టారు. కూటమి నేతలు తమ కార్పొరేటర్ల పై పూర్తిస్థాయి నమ్మకం ఉండడంతో   శిబిరాన్ని ఏర్పాటు చేయలేదు అయితే ఈనెల 19న కౌన్సిల్ జరుగుతున్న దశలో వైసీపీ మాదిరిగా తమను కూడా విహారయాత్రకు తీసుకువెళ్లాలని తెలుగుదేశం కార్పొరేటర్లు కొందరు ప్రతిపాదన చేశారు.  దీంతో ఆ పార్టీ తరఫున మేయర్ పీఠం అవకాశం ఉన్న  తెలుగుదేశం నాయకుడు పీలా శ్రీను తమ వర్గం కార్పొరేటర్ లను మలేషియా తీసుకువెళ్లారు. రెండు పార్టీల కార్పొరేటర్లు ఈనెల 19న జరిగే కౌన్సిల్ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ వ్యవహారం తెలిసిన విశాఖ ప్రజలు కార్పొరేటర్ల తీరు పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వేసవి తీవ్రత మొదలైంది.

మరో రెండు వారాల్లో వర్షాలు కురవనట్లయితే కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే  రైవాడ, మేఘాద్రి గడ్డ ముడసరలోవ... గంభీరం లాంటి రిజర్వాయర్లలో పూడిక తీయాలన్న ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. వీటితోపాటు నగరంలో చాలా   ప్రజా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ఇలాంటి సమయంలో కౌన్సిల్లో ప్రజా సమస్యలు చర్చించడానికి సిద్ధం కావలసిన కార్పొరేటర్లు రాజకీయాల కోసం విదేశాలకు వెళ్లడం ప్రజలు ఇష్టపడడం లేదు. పట్టుమని ఏడాది కాలం గడువున్న మేయర్ పీఠం కోసం ఎందుకు ఇంత ప్రయాస పడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. కొండవాలు ప్రాంతాల్లో చాలా సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. టిడ్కో ఇళ్ళ కోసం దరఖాస్తులు చేసిన ప్రజలకు ఇప్పటికీ ఇళ్ల విషయంపై ఓ స్పష్టత లేదు. ఇక వైసీపీ హయాంలో ఇచ్చిన  ఇళ్ల  స్థలాలు సెంటు సెంటున్నర భూముల వ్యవహారం కూడా అస్పష్టంగా ఉంది. వీటితో పాటు జీవీఎంసీ పరిధిలో వైఎసీపీ హయాంలో అడ్డుగోలుగా కొన్ని భూములు కేటాయింపు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇక రాజకీయ అండతో పలువురు ఆస్తి పన్ను ఎగవేశారన్న అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని చర్చించాల్సిన కార్పొరేటర్లు బాధ్యత మరిచారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఏడాది గడువుండే మేయర్ పీఠం ఎవరికి దక్కినా పెద్ద ప్రయోజనం ఉండే పరిస్థితి లేదు. కానీ రాజకీయ ప్రతిష్ట కోసం వైసీపీ, తెలుగుదేశం కార్పొరేటర్లు ప్రజా సమస్యను మరిచి విలాసాల బాట పట్టారని విశాఖ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.