విశాఖలో భారీ అగ్నిప్రమాదం.. 40 ఫైరింజన్లు.. 14 గంటలు

 

విశాఖపట్నంలో భారీ అగ్నిప్రమాదమే సంభవించింది. విశాఖ దువ్వాడ ఎస్‌ఈజెడ్‌లోని బయోమాక్స్ కంపెనీలో నిన్న రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి 7.30 గంటల సమయంలో కంపెనీలో ఆయిల్ రిఫైనరీ ట్యాంకర్లు పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. బయోమ్యాక్స్ కంపెనీలోని 18 ముడి చమురు ఆయిల్ ట్యాంకర్లలో 12 ట్యాంకర్లు తగలబడగా.. అందులో 6 ట్యాంకర్లు పూర్తిగా దగ్ధమయ్యాయినట్టు అధికారులు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా ట్యాంకర్లు పేలడం వల్ల భారీగా ఎగసిపడుతున్న మంటలను ఆర్పడానికి ఫైర్ సిబ్బంది తంటాలు పడుతున్నారు. మొత్తం 40 ఫైరింజన్లతో దాదాపు 14 గంటల నుండి మంటలను ఆర్పడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నా.. మంటలను ఆర్పలేకపోతున్నారు ఫైర్ ఇంజన్ సిబ్బంది. కాగా ఈ ప్రమాదం వల్ల దాదాపు 200 కోట్ల నష్టం జరిగినట్టు తెలుస్తోంది.

 

మరోవైపు 100 అడుగులకుపైగా ఎత్తులో ఎగసిపడిన మంటలు చుట్టుపక్కల ప్రజలను భయభ్రాంతులకు గురిస్తున్నాయి. బయో డీజిల్ ట్యాంకర్లు పేలడంతో పొగ కాలుష్యం ఆ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు విశాఖ నగరాన్ని కమ్మేసింది. అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం ఆరా తీశారు. ఘటనా స్ధలాన్ని హోంమంత్రి చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్‌, ఫైర్‌ సర్వీసెస్‌ డీజీ, నౌకాదళ అధికారులతో మాట్లాడారు. కంపెనీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రులు సూచించారు.