పులివెందులలో ఏం జరిగింది... కుక్కను చంపిన హంతకులు!

 

మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (68) దారుణహత్యకు గురయ్యారు. ఏపీలోని వైఎస్సార్ కడపజిల్లా పులివెందులలోని తన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున విగతజీవిగా పడిఉన్న ఆయనను వ్యక్తిగత సహాయకుడు గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. గుండెపోటుతో మృతిచెందారని తొలుత భావించారు. అయితే పోస్టుమార్టం నివేదికలో హత్యగా వెల్లడైనట్టు ఏపీ పోలీసులు తెలిపారు. అంతే కాకుండా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఆయన ఇంటి పరిసరాల్లో నిత్యం తచ్చాడే ఓ కుక్కను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపేశారు. ఆ ప్రాంతంలో కొత్త వ్యక్తులు కనబడితే మొరిగే ఈ కుక్కన్ని మర్డర్ ప్లాన్‌లో భాగంగానే హత్య చేసినట్టు తెలుస్తోంది.హత్యకు ముందు నిర్వహించిన రెక్కీలో కుక్కను గమనించిన దుండగులు దాని అడ్డు ముందే తొలగించుకుని హత్యకు పథకం పన్నినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివేకానందరెడ్డి హత్యపై ఆయన పీఏ కృష్ణారెడ్డి మీడియా ఎదుట పలు అనుమానాలు వ్యక్తంచేశారు.

 

 

ఉదయం వివేకానందరెడ్డి ఇంటికి వెళ్లా. ఆయన తలుపు తీయకపోవడంతో బయట కూర్చొని పేపర్ చదివా. అరగంట తరువాత కూడా లేవకపోవడంతో అనుమానం వచ్చి సౌభాగ్యమ్మకు ఫోన్‌చేశా. సార్ ఇంకా లేవలేదు లేపాలా? అని అడిగా. నైట్‌లేట్‌గా వచ్చినట్లున్నారు.. లేపొద్దని చెప్పారు. మరో అరగంటపాటు బయటే వెయిట్ చేశా. ఇంతలో ఇంట్లో పనిచేసే లచ్చమ్మ, ఆమె కొడుకు వచ్చారు. సార్ పడుకునే ఉన్నారు.. వెనుక కిటికీ కొడితే లేస్తారు.. లేపండని పనిమనిషికి చెప్పా. వారు వెళ్లి కిటికీ కొట్టినా లేవలేదు. నేను కూడా ప్రయత్నించా పలుకలేదు. గాఢనిద్రలో ఉన్నారని అనుకున్నాం. మెయిన్‌డోర్ మూసి ఉంది కానీ.. గడియపెట్టిలేదు. ఆ డోర్ ఓపెన్ అయినట్టు రంగన్న అనే వృద్ధుడు చెప్పాడు. లచ్చమ్మ కొడుకు, నేను లోపలకు వెళ్లి చూడగా బెడ్‌రూం తెరిచి ఉన్నది. సార్ బాత్రూమ్‌లో రక్తపు మడుగులో పడిఉన్నారు. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాను. ఆ డోర్ ఎందుకు తీసారా? అనే అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశా అని కృష్ణారెడ్డి తెలిపారు.