బ్రాహ్మిణి ఉక్కు కడపజిల్లా హక్కు
Published on: Mon May 7, 2012 10:06AM
గతంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉద్యమించిన ఆంధ్రులు ఎట్టకేలకు విశాఖ ఉక్కును సాధించుకున్నారు. ఫలితంగా వేలమందికి ఈ కర్మాగారంలో ఉపాథి లభించింది. విశాఖ ఉక్కు కర్మాగారానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. ఆ నాటి ఉద్యమం స్ఫూర్తితోనే బ్రాహ్మణి ఉక్కు కడప జిల్లా హక్కు అనే నినాదంతో ఉద్యమించాలని కడపజిల్లావాసులు సమాయత్తమవుతున్నారు. వై.ఎస్. హయాంలో గాలి జనార్థనరెడ్డి ఈ జిల్లాలో అతిపెద్ద ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు నిర్ణయించారు.
అయితే వై.ఎస్. మరణం, గాలిజనార్థనరెడ్డి అరెస్టుతో ఈ ప్రాజెక్టు భవిష్యత్తు అయోమయంలో పడింది. దీనికి కేటాయించిన 14 వేల ఎకరాలు ఖాళీగా ఉంది. ఈ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే యోచనలో ప్రభుత్వం ఉంది. స్థానిక ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడే ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమానికి సన్నద్ధమవు తున్నారు. ఈ జిల్లతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అపారంగా ఉక్కుగానులు ఉన్నాయని, కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంతంగా గనులు లేకపోయినా లాభాల బాటలో ఉందని వారు గుర్తు చేస్తున్నారు. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడం వల్ల వేలాదిమందికి ఉపాథి లభించడమే కాకుండా జిల్లా ఎంతగానో అభివృద్ధి చెందుతుందని వారు అంటున్నారు. వివిధ ప్రజాసంఘాల నాయకులు ఇటీవల పొద్దుటూరులో సమావేశమై బ్రాహ్మణి ఉక్కు కడపజిల్లా హక్కు అనే నినాదంతో పెద్దఎత్తున ఉద్యమించాలని నిర్ణయించారు.


