అంతా రహస్యం.. గప్‌చుప్‌గా అమ్మేస్తారా?
Published on: Tue Jun 15, 2021 6:27PM
ఒకప్పుడు అంతా పారదర్శకం అన్నారు. ఇప్పుడు అంతా రహస్యం అంటున్నారు. అంతా ఏపీ సర్కారుకు చెప్పే చేస్తున్నామన్నారు. కేంద్రానికి జగన్‌రెడ్డి ప్రభుత్వం సహకరిస్తోందని తెలిపారు. ఆ అమ్మకం వివరాలు ఏంటో చెప్పాలని అడిగితే మాత్రం హుష్.. గప్‌చుప్ అంటున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అడ్డగోలుగా అమ్మే యవ్వారం బయటపెట్టేందుకు ససేమిరా అంటూ మొండికేస్తున్నారు. తాజాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆర్టీఐ ద్వారా సమాచారం ఇచ్చేందుకు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్-డిఐపీఏఎం నిరాకరించింది. ఆ వివరాలు ఆర్థిక రహస్యాలంటూ ఆర్టీఐ అభ్యర్థనను తిరష్కరించింది.
ఆర్టీఐ కార్యకర్త ఇనుగంటి రవికుమార్ అడిగిన సమాచారాన్ని ఇచ్చేది లేదని డిఐపీఏఎం స్పష్టం చేసింది. విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ అంశం ఆర్ధిక రహస్యాల పరిధిలోకి వస్తుందని తెలిపింది. ఈ అంశంపై సీఎం జగన్ , ప్రతిపక్షనేత చంద్రబాబు రాసిన లేఖలపై సమాధానం ఇవ్వాలంటూ ప్రధాని కార్యాలయం ఆదేశించినా డిఐపీఏఎం పట్టించుకోలేదు. విశాఖ స్టీల్ ప్లాంటులో పెట్టుబడుల ఉప సంహరణ సమాచారం సెక్షన్ 8 (1) (ఏ) కింద గోప్యంగా ఉంచాలని డీఐపీఏఎం చెప్పింది.
నష్టాల పేరుతో విశాఖ ఉక్కును అడ్డగోలుగా అమ్ముకోవాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. పార్లమెంట్‌లోనే ఆ మేరకు ప్రకటన చేసింది కేంద్రం. అయితే, ఆ ప్రైవేటీకరణ సమాచారం ఇచ్చేందుకు మాత్రం ససేమిరా అంటుండటం ఆసక్తికరం. అమ్మకంలో గోల్‌మాల్ వ్యవహారాలు ఏమీ లేకపోతే.. అంత దాపరికం ఎందుకనేది కార్మికుల ప్రశ్న. అందుకే, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మెకు సిద్ధమవుతున్నారు స్టీల్ ప్లాంట్ సిబ్బంది. ఈ మేరకు యాజమాన్యానికి సమ్మె నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పటికే ఆందోళనలతో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేశారు. తాజా సమ్మె నోటీసులతో ఉద్యమం మరింత ఉరకలెత్తనుంది.


