విశాఖ ఉక్కుకు ముడి ఇనుము కొరత
Published on: Wed Mar 14, 2012 5:54PM
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో రాష్ట్ర ప్రజలు ఉద్యమాలు జరిపి ప్రాణాలు ఫణంగా పెట్టి ఉక్కు కర్మాగారాన్ని సాధించారు. మొదట్లో కొంతకాలం నష్టాల్లో ఉన్నప్పటికీ ఈ కర్మాగారం ఇప్పుడు లాభాల్లో పయనిస్తోంది. వేలాదిమంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. అయితే ఇప్పుడు ఈ కర్మాగారానికి ముడి ఖనిజం కొరత రూపంలో ముప్పు ఎదురుకాబోతుంది. విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రస్తుతం నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ముడి ఖనిజాన్ని సరఫరా చేస్తోంది. ఈ సరఫరా ఉక్కు అవసరాలకు తగినంతగా లేకపోవడం, ఖనిజం ధర పెరగడంతో విశాఖ ఉక్కు మళ్ళీ నష్టాల మార్గంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. దీనికి తోడు ఉక్కు కర్మాగారాన్ని విస్తరించాలన్న యాజమాన్యం నిర్ణయం కూడా ముడి ఖనిజం కొరత కారణంగా వాయిదాపడే ప్రమాదం ఉంది.
అసలు ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పని కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో గనులను ధారాదత్తం చేసింది. గాలి జనార్ధన్ రెడ్డి కూడా కడపలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పుతానంటూ అనంతపురంలో గనులను లీజుకు తీసుకున్నాడు. కర్మాగారాన్ని నెలకొల్పకుండానే గనుకను లూటీ చేశాడు. చివరకు జైలు పాలయ్యారు. అటువంటి వ్యక్తులను నమ్ముతున్న ప్రభుత్వాలు వేలాదిమందికి ఉపాధినిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారానికి మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ గనులను కేటాయించడపోవడం శోచనీయం. ఈ కర్మాగారానికి గనులు కేటాయించాలని ఉక్కు కర్మాగార యాజమాన్యం ఎప్పటినుంచో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతోంది. కానీ ఏ ప్రభుత్వం సరిగా స్పందించడం లేదు. ఒడిశా, చత్తీస్ ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో గనులకోసం విశాఖ ఉక్కు యాజమాన్యం దరఖాస్తులు చేస్తుంది. అయితే తమ రాష్ట్రాల్లో విశాఖ ఉక్కుకు అనుబంధంగా యూనిట్లు ఏర్పాటుచేస్తే కనులు లీజుకు ఇస్తామని ఆ ప్రభుత్వాలు షరతు పెట్టాయి. కానీ రాష్ట్రంలోనే విశాఖ ఉక్కు కర్మాగారం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం డానికి ఇప్పటిదాకా గనుకను కేటాయించలేదు. పెరుగుతున్న ఖర్చులు కారణంగా విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు లేకపోతే డానికి భవిష్యత్తు ఉండదని కార్మిక సంఘాలు అంటున్నాయి.


