విశాఖలో ఐఏఎస్ ల మధ్య కోల్డ్ వార్
Published on: Tue Feb 28, 2012 2:46PM
సెలవుపై వెళ్ళిన రామాంజనేయులు
విశా
ఖపట్నం: విశాఖజిల్లాలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తనకన్నా జూనియర్ వద్ద తనను పనిచేయమంటున్నారంటూ జివిఎంసి కమీషనర్, ఐఏఎస్ అధికారి అయిన వివాదాస్పద బి.రామాంజనేయులు తీవ్రంగా అలిగి సెలవుపై వెళ్ళిపోయారు. జివిఎంసి పాలకవర్గం పదవీకాలం కొద్ది రోజుల క్రితం ముగిసింది. దీనికి కమీషనర్ గా బి.రామాంజనేయులు ఉన్నారు. పాలకవర్గం పదవీకాలం ముగిసిన తరువాత ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ లవ్ అగర్వాల్ ను నియమించింది. ఇది రామాంజనేయులుకు ఆగ్రహాన్ని, అసంతృప్తిని కలిగించింది. కలెక్టర్ లవ్ అగర్వాల్ తనకంటే జూనియర్ అధికారి అని ఆయనను తనపై ప్రత్యేక అధికారిగా నియమించడం ఏమాత్రం సమంజసం కాదని, అసలు ఆయన వద్దకు వెళ్ళి తాను ఎలా పనిచేయగాలనని రామాంజనేయులు ప్రశ్నిస్తున్నారు. జివిఎంసిలో ఇప్పటి వరకు స్వతంత్రంగా వ్యవహరించానని, ఇకనుంచి ప్రతి పనికి కలెక్టర్ వద్దకు వెళ్ళాల్సి ఉంటుందన్నారు. పాలకవర్గం పదవీకాలం ముగియడంతో స్పెషలాఫీసర్ గా సీనియర్ అధికారులు శ్యాంబాబు లేదా విజయకుమార్ ను నియమించాలని రామాంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు విజయకుమార్ ను నియమించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విజయ్ కుమార్ అయిష్టత చూపడంతో జిల్లా కలెక్టర్ కు అవకాశం కలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మనస్తాపానికి గురైన రామాంజనేయులు సెలవు పై వెళ్ళారు. రామాంజనేయులు తీరు లవ్ అగర్వాల్ కు కూడా ఇబ్బందికరంగా మారింది. హుందాగా వ్యవహరించాల్సిన సీనియర్ అధికారి ఇలా చీప్ గా బిహేవ్ చేయడం ఏమిటని లవ్ అగర్వాల్ తన సన్నిహితుల వద్ద అన్నట్లు తెలిసింది. వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ విశాఖ నగరాభివృద్ధికి శాపంగా మారే ప్రమాదం ఉందని నగర వాసులు అందోళన చెందుతున్నారు.


