ఉచ్చులో మరో మంత్రి?
Published on: Wed Feb 15, 2012 9:25AM
వి
శాఖపట్నం: మద్యం ముడుపుల ఉచ్చులో ఇప్పటికే రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి చిక్కుకుని గిలగిలలాడుతున్నారు. తాజాగా విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ఎసిబి దాడులు జరిపి ఎక్సైజ్ అధికార్లు, సిండికేట్ లీడర్లనుంచి రాబట్టిన సమాచారంలో మరో రాష్టమ్రంత్రికి ముడుపులు ఇచ్చినట్టు తేలింది. ఆ మంత్రి ఎవరన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎసిబి అధికారులు గత నెల 28న విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తృతంగా దాడులు జరిపి మొత్తం 14మంది ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది, మూడు సిండికేట్లకు చెందిన లీడర్లు, సిబ్బందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిని నాలుగు రోజులపాటు ఎసిబి ప్రశ్నించింది. వీరినుంచి రాబట్టిన ప్రాథమిక సమచారాన్ని కోర్టుకు సమర్పించారు. ఇందులో ఓ మంత్రికి కూడా ముడుపులు ముట్టినట్టు పేర్కొన్నారు. సిండికేట్ నుంచి స్వాధీనం చేసుకున్న నోట్బుక్లో రాష్ట్ర మంత్రికి లక్షా 20వేల రూపాయలు మామూళ్లు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇది ఎమ్మార్పీ సెటిల్మెంట్ కోసం అని కూడా రాశారు. నెలకు 15వేలు రూపాయల చొప్పున ఎనిమిది నెలలపాటు ఆ మంత్రికి ముడుపులు చెల్లించినట్టు ప్రాథమిక నివేదికలో స్పష్టం చేశారు. ఎమ్మార్పీ సెటిల్మెంట్ కోసం ముడుపులు ఇచ్చారని సిండికేట్లు పేర్కొన్నారు.
విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మంత్రులు ఎమ్మార్పీ సెటిల్మెంట్ల విషయంలో జోక్యం చేసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మరి విజయనగరం జిల్లానుంచి బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్నారు. ఆ జిల్లాలో ఎసిబి అధికారులు దాడులు జరపలేదు. మరి ఆయన విశాఖ జిల్లాలో ఎమ్మార్పీపై అమ్మకాలను శాసించే పరిస్థితులు అంతగా ఉండకపోవచ్చు. ఎమ్మార్పీ సెటిల్మెంట్ కోసం మంత్రికి ముడుపులు ఇచ్చారంటే అందుకు సంబంధించిన మంత్రిగానే భావించాలా? లేక మరో మంత్రికి ఈ ముడుపుల వ్యవహారంలో సంబంధం ఉందా? అన్నది తేలాల్సి ఉంది. సదరు మంత్రికి 30-11-2011న పై మొత్తాన్ని చెల్లించినట్టు సిండికేట్ నోట్బుక్లో పేర్కొన్నారు. ఇందులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కూడా భారీగానే ముడుపులు అందాయి. అలాగే ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారులకూ పెద్దఎత్తున ముడుపులు అందాయి. ఇక ఎసిబి అరెస్టు చేసిన ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది, సిండికేట్ లీడర్లు, సిబ్బందికి ఇప్పట్లో బెయిల్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. రాష్టవ్య్రాప్తంగా కోట్ల రూపాయలు చేతులు మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం మొత్తం తేలే వరకూ అరెస్టు అయిన ఎవ్వరికీ బెయిల్ రాకపోవచ్చని తెలుస్తోంది.


