ఇక అభివృద్ధి ఎలా? చిరంజీవి
Published on: Thu Jan 12, 2012 8:40AM
వి
శాఖపట్నం: తన నియోజకవర్గం తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో అనస్థీషియన్ లేరని, ఆ పోస్టు భర్తీ చేయాలని ఆరోగ్యశాఖలో ముగ్గురు మంత్రులను కలిశానని, చివరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శిని కలిసినా ప్రయోజనం లేదని కాంగ్రెసు పార్టీ నేత, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి అన్నారు. చిన్న పని చేయడానికే ఇన్ని ఇబ్బందులైతే.. ఇక అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. కొత్త ఎమ్మెల్యేల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన బుధవారం మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు బాలికల హాస్టల్‌ను సందర్శించినప్పుడు, అక్కడి అమ్మాయిలను ఏం కావాలని అడిగితే, "ఏమీ వద్దు. మరుగుదొడ్లు కట్టిస్తే చాలు' అని చెప్పగా.. తాను సొంత డబ్బు రూ. 3 లక్షలతో మరుగుదొడ్లు, బాత్రూమ్‌లు కట్టించానన్నారు. అన్నిచోట్లా ఇలా చేయలేం కాబట్టి ప్రభుత్వ పరంగా తగిన వసతులు కల్పించాల్సి ఉందన్నారు. బాక్సైట్ తవ్వకాలను చేపట్టవద్దని ఆయన కోరారు. అధికారులు తమకు ఏమీ చెప్పడం లేదని ఎమ్మెల్యేలు అన్నారు.


