విశాఖలో కాఫీతోటల వివాదం
Published on: Tue Feb 21, 2012 9:08AM
వి
శాఖ జిల్లా: విశాఖ జిల్లా బలపం కాఫీ తోటల వివాదం పోలీసులకు సవాలుగా మారింది. ఎపి ఎఫ్ డిసి ఆధ్వర్యంలో ఉన్న ఈ తోటలను తమకు కేటాయించాలని గిరిజనులు కోరుతున్నారు. వీరికి మావోయిస్టులు కూడా మద్దతు ఇస్తున్నారు. గూడెం కొత్తవీధి మండలం, ఆర్ వి నగర్, ఎపి ఎఫ్ డిసి పరిధిలో మర్రిపాకలు ఎస్టెట్ కు చెందిన 64 హెక్టార్ల కాఫీ తోటలను ఐదేళ్ళ క్రితం, చింతపల్లి పరిధిలోని 100 హెక్టార్ల కాఫీ తోటలను రెండేళ్ళ క్రితం మావోయిస్టులు గిరిజనులకు పంపిణీ చేశారు. కాఫీ సిబ్బంది నివాస గృహాలను ధ్వంసం చేశారు. తాము పంపిణీ చేసిన తోటల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. మావోయిస్టుల చర్యలతో కాఫీ బోర్డు భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. కాఫీ తోటల పంపకాన్ని సవాలుగా తీసుకున్న పోలీసులు 95 మంది గిరిజనులపై కేసులు నమోదు చేశారు. వీరంతా స్వచ్ఛందంగా లొంగిపోవాలని, లేకుంటే అరెస్టులు చేస్తామని పోలీసులు పదే పదే హెచ్చరించారు. అయితే గిరిజనులు వారి హెచ్చరికలను ఖాతరు చేయడం లేదు. పోలీసులు అరెస్ట్ చేయడానికివస్తే వందలాది మంది గిరిజనులు వారిపై దాడికి ప్రయత్నిస్తున్నారు. దీనితో బలపం కాఫీ తోటల వివాదం పోలీసులకు పెను సవాలుగా మారింది.


