బాలరాజు సేవలో పంచాయితీరాజ్
Published on: Sat Feb 25, 2012 2:59PM
విశాఖ
జిల్లా: విశాఖజిల్లా నర్సీపట్నంలో పంచాయితీరాజ్ శాఖ అధికారులు మంత్రి బాలరాజు సేవలో తరిస్తున్నారు. ఆయన స్థలానికి రాజమార్గాన్ని నిర్మించేందుకు మార్గం సుగమం చేసి విధేయతను చాటుకున్నారు. లక్షలాది రూపాయల ఆర్టీసీ స్థలాన్ని కొనుగోలుచేసి రహదారి నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మంత్రిగారి స్థలానికి వెళ్ళే దారిలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులొస్తాయని భావించి అడ్డుగా ఉన్న ఆర్టీసీ స్థలాన్ని అడ్డగోలు రేటుకు కొనుగోలుచేసి రహదారి నిర్మిస్తున్నారు.
మంత్రి బాలరాజుకు నర్సీపట్నం ఆర్టీసీ డిపోను ఆనుకుని సుమారు 18సెంట్ల స్థలం ఉంది. ఈ స్థలానికి వెళ్ళేముందు సన్నని రోడ్డు ఉంది. ఆర్టీసీ స్థలానికిగల ప్రహరీ కారణంగా ఈ రహదారి సన్నగా ఉంది. గతంలో ఈ స్థలాల్ని కొనుగోలుచేసిన మంత్రి అధికారంలో లేక పోవడంతో రహదారిని వెడల్పు చేసుకోలేకపోయారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దీనిపై దృష్టి సారించారు. పంచాయితీరాజ్ శాఖను రంగంలోకి దించారు. ఈ శాఖ ఆర్టీసీ స్థలాన్ని చౌకగా కొనేసి మంత్రిగారి స్థలానికి వెళ్ళే మార్గాన్ని వెడల్పుచేసే పనిలో తలమునకలై ఉంది. ఈ రహదారిని సిమెంట్ రోడ్డుగా మార్చేందుకు సైతం ప్రణాళికను సిద్దం చేస్తున్నారు.


