హీరోయిన్లను పెళ్లి చేసుకున్న క్రికెటర్లు వీరే..

 

ఇండియాలో ఉన్నవి రెండే మతాలు.. ఒకటి క్రికెట్ రెండు సినిమా.. జనాభాను బట్టి చూస్తే అతిపెద్ద మతం క్రికెట్టే.. ఆ తర్వాతి స్థానం.. సినిమాది. క్రికెట్ సీజన్ వచ్చిందంటే చాలు భక్తిప్రపత్తులతో టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్‌లు చూస్తూ తరిస్తారు క్రికెట్ భక్తులు.. ఇక అభిమాన హీరో సినిమా విడుదలయ్యిందంటే చాలు కటౌట్లకు, బ్యానర్లకు అభిషేకాలు, పూజలు, పునస్కారాలు అబ్బో అభిమానులకు పెద్ద పండగే. అలాంటి క్రికెట్, సినిమా కలిసిపోతే.. అంటే ఇష్టమైన క్రికెటర్, ఫేవరేట్ హీరోయిన్ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది. అభిమానులకి వచ్చిన ఈ ఆలోచనని నిజం చేసేందుకు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో హీరోయిన్లు, క్రికెటర్లు తెగ కష్టపడుతున్నారు. అవును క్రికెటర్లకు హీరోయిన్లకు ఉన్న బంధం ఈ నాటిది కాదు.. చరిత్రను పరిశీలిస్తే.. బోలెడన్ని ప్రేమాయణాలు.. ఎఫైర్లు.. కొన్ని పెళ్లిళ్లు ఎన్నో ఎన్నెన్నో. తాజాగా విరాట్-అనుష్క పెళ్లితో బాలీవుడ్ తారలతో క్రికెటర్ల ప్రేమాయణాల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో బాలీవుడ్ హీరోయిన్లను పెళ్లి చేసుకున్న క్రికెటర్లు ఎవరో ఒకసారి చూస్తే.

భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ.. నటి షర్మిల ఠాగోర్‌ల వివాహం 1969లో జరిగింది. ఈ దంపతుల కుమారుడే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్.

అలనాటి బాలీవుడ్ నటి నీనాగుప్తా.. విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ మధ్య రిలేషన్ షిప్ గురించి అప్పట్లో మీడియా కోడై కూసింది. వారి బంధానికి గుర్తుగా ఓ కూతురు కూడా ఉంది.. కానీ వారు పెళ్లి చేసుకోలేదు.

నాగిన్ సినిమాతో దేశాన్ని ఒక ఊపు ఊపిన రీనా రాయ్ పాకిస్థానీ క్రికెటర్ మొహిసిన్ ఖాన్‌ను 1983లో పెళ్లాడింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఈ జంట విడాకులు తీసుకుంది.

హైదరబాదీ.. టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌ బాలీవుడ్ నటి సంగీతా బిజ్లానీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే అభిప్రాయ భేదాల కారణంగా వారిద్దరూ 2010లో విడాకులు తీసుకున్నారు.

ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ప్రేమకు ముగింపు పలుకుతూ.. చక్‌దే ఇండియాలో నటించిన సాగరికా ఘట్కేను.. భారత మాజీ బౌలర్ జహీర్‌ఖాన్ పెళ్లాడాడు.

టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్‌ యువరాజ్ సింగ్ నటి హజెల్ కీచ్‌ను గతేడాది వివాహం చేసుకున్నాడు.. ఈమె సల్మాన్‌ఖాన్ నటించిన బాడీగార్డ్ మూవీలో కీలక పాత్ర పోషించింది.