కాలికనడకన తిరుమల కొండకు 116 ఏళ్ల బామ్మ.. టీటీడీ రియాక్షన్.. వెరీ గుడ్.!
Published on: Mon Jul 6, 2026 11:46AM

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల పవిత్ర క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. సాధారణంగా భక్తులు తిరుమలేశుని దర్శనం చేసుకోవడానికి గంటల తరబడి కంపార్ట్ మెంట్లలో, క్యూలైన్లలో వేచి చూడాల్సి వస్తుంది. వీఐపీ బ్రేక్ దర్శనాల సమయం తక్కువగా ఉంటుంది. క్యూలైన్లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా బ్రేక్ దర్శనం భక్తులకు ఒకింత సులభంగా స్వామి వారి దర్శన భాగ్యం కలుగుతుంది. ఆ వీఐపీ బ్రేక్ దర్శనం మూమూలు భక్తులకు లభించే అవకాశం ఇసుమంతైనా లేదు. కానీ ఓ సామాన్య భక్తురాలికి టీటీడీ ఆ సౌకర్యం కల్పించింది. ఆమెను వెతికి పట్టుకుని మరీ వీఐపీ బ్రేక్ దర్శనం చేయించింది.
ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 116 ఏళ్ల వయసున్న ఒక వృద్ధురాలు శ్రీవారి దర్శనం కోసం కొండపైకి కాలినడకన వచ్చారు. ఆ వయోవృద్ధురాలు మెట్లు ఎక్కుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. సాధారణంగా యువకులే తిరుమల కొండ మెట్లు ఎక్కడానికి ఆపసోపాలు పడుతుంటారు. అలసిపోయి పదేసి మెట్లకు ఒక సారి ఆయాసంతో విశ్రాంతి తీసుకుని మళ్లీ నడక ప్రారంభిస్తుంటారు. అటువంటిది.. 116 ఏళ్ల వయస్సులో, శారీరక ఇబ్బందులను అధిగమించి, కేవలం భగవంతుడిపై ఉన్న అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఆమె తిరుమల కొండ మెట్లను ఎక్కి స్వామివారి దర్శనం కోసం రావడం నెటిజనులనే కాదు, సామాన్యులనుసైతం విశేషంగా ఆకట్టుకుంది.
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
వెంటనే స్పందించిన ఆయన ఆ వృద్ధురాలి వివరాలను తెలుసుకుని.. మెట్టు మెట్టూ ఎక్కి తిరుమలేశుని దర్శనానికి వచ్చిన ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా విఐపి బ్రేక్ దర్శనం కల్పించారు. 116 ఏళ్ల వయసులో కాలినడకన వచ్చిన నవనీతమ్మకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అత్యంత గౌరవప్రదంగా స్వామివారిని దర్శించుకు ఏర్పాట్లు చేశారు. టీటీడీ చర్యపట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Tirumala updates, TTD VIP Break Darshan, 116 year old lady Tirumala, Navaneetamma Tirupati


