మహిళ ట్రాక్టర్ నడిపితే గ్రామ బహిష్కారమా?
Published on: Fri Aug 5, 2022 11:00AM
ఆకాసంలో సగం.. అవకాశాలలో సగం అంటూ మహిళలు అన్ని రంగాలలోనూ దూసుకుపోతున్నారు. అయితే ఇప్పటికీ మహిళలపై వివక్ష మాత్రం కొనసాగుతూనే ఉంది. తాము వంటిళ్లకే పరిమితం కాదనీ, హద్దులు, సరిహద్దులూ లేకుండా మగవారితో సమానంగా అంతరిక్షంలోకి సైతం దూసుకుపోగలమని మహిళలు పదే పదే నిరూపిస్తున్నా.. ఇంకా వివక్ష భూతంలా వారిని వెంటాడుతూనే ఉంది. అటువంటి వివక్షతో ఓ అమ్మాయికి గ్రామ బహిష్కరణ విక్ష విధించింది. ఇంతకీ విషయమేమిటంటే..కుటుంబాన్ని పోషించే బాధ్యతను భుజానికెత్తుకున్న ఓ 22 ఏళ్ల అమ్మాయి, వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది.
సొంతంగా ట్రాక్టర్ నడుపుతూ వ్యవసాయ పనులు చేసుకుంటోంది. అయితే అమ్మాయేమిటి.. ట్రాక్టర్ నడపడమేమిటన్న మగ దురహంకారం ఆమెకు గ్రామ బహిష్కరణ శిక్ష విధించింది. ఈ సంఘటన జార్ఖండ్ లోని శివనాథ్ పురంలో జరిగింది. మంజూ ఒరాన్ అనే యువతి తల్లిదండ్రులు సోదరులతో కలిసి జీవిస్తోంది. ఆమె బిఏ మొదటి సంవత్సరం చదువుతోంది. వారికి ఆరెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే ఆ భూమి ద్వారా వచ్చే ఆదాయం కుటుంబం గడవడానికి సరిపోవడం లేదు. దీంతో మరో పదెకరాలు కౌలుకు తీసుకున్నారు. వ్యవసాయ పనుల కోసం ఆ కుటుంబం ట్రాక్టర్ కొనుగోలు చేసింది.
మంజు కూడా కుటుంబ బాధ్యతలలో భాగం పంచుకోవాలన్న ఉద్దేశంతో ట్రాక్టర్ నడపడం నేర్చుకుని స్వయంగా పొలం దున్నుతోంది. అయితే దీనిని జీర్ణించుకోలేని కొందరు గ్రామస్థులు.. ఆడపిల్లలు ట్రాక్టర్ నడిపితే గ్రామానికి అరిష్టం అంటూ అడ్డుకున్నారు.
అయితే వారిని లెక్క చేయని మంజు కుటుంబం ట్రాక్టర్ తో పొలంపనులు చేయడం మానలేదు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఆమెను గ్రామం నుంచి బహిష్కరించడమే కాకుండా జరిమానా కూడా విధించారు. అయితే గ్రామ పంచాయతీ తీర్పును ఖాతరు చేయని మంజు వారిని ఎదిరించింది. న్యాయపోరాటం చేయడానికి సిద్ధపడింది.


