వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ లో యలమంచిలి రవి!
Published on: Thu Apr 26, 2012 12:23PM
విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు యలమంచిలి రవి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి చేరువ అవుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయనాయకునిగా కాకుండా రైతువారి పద్ధతిలో వుండే రవి అంటే ప్రజలలో మంచి గుర్తింపు వుంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీచేసి రవి తెలుగుదేశంపార్టీ అభ్యర్థి మాజీ ఎంపి గద్దె రామమోహన్, కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి దేవినేని నెహ్రూ (రాజశేఖర్)లను ఓడించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుండటం వల్ల మాజీ మంత్రి దేవినేని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా వున్నారు. అయితే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనమైన నేపథ్యంలో యలమంచిలి కూడా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నియమావళి ప్రకారం నియోజకవర్గంలో శాసనసభ్యుడే ఇన్ ఛార్జిగా వుంటారు. కానీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించే ప్రభుత్వపరమైన సమీక్షా సమావేశాల సందర్భంగా, పిసిసి అధ్యక్షులు బొత్స నిర్వహించే సమీక్షాసమావేశాల సందర్భంగా తూర్పు నియోజకవర్గం తనపై ఓడిపోయిన మాజీ మంత్రి దేవినేని నెహ్రూను కూడా ఆహ్వానించడాన్ని తనకు అవమానంగా భావిస్తున్నారు.
వాస్తవంలో కూడా ప్రభుత్వం యలమంచిలి పట్ల సవితి ప్రేమనే చూపిస్తోందనేది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ స్థితిలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీనుంచి యలమంచిలికి ఆహ్వానం లభించినట్టు తెలిసింది. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమైన వంగవీటి రాధా ఇటీవల వరకు విజయవాడ సెంట్రల్ నుంచి కాకుండా తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే భావనలో వున్నారు. కాని రాధా 2014 ఎన్నికల్లో కొత్త నియోజకవర్గం నుంచి కాకుండా సెంట్రల్ నియోజకవర్గం నుంచే పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు.
ఈ స్థితిలో యలమంచిలి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ లో చేరితే మరల 2014నుచి కూడా విజయవాడ తూర్పు నుంచే పోటీ చేయవచ్చునని ఆయనకు వివరించినట్టు తెలిసింది. యలమంచిలికి దేవినేని నెహ్రూతో ఎంతోకాలం రాజకీయవైరం వుంది. తనకు గౌరవం ఇవ్వని కాంగ్రెస్ లో వుంటూ నెహ్రూతో వున్న వైరంతో ఇబ్బంది పడేకంటే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ లో చేరడమే ఉత్తమమనే నిర్ణయానికి యలమంచిలి వచ్చినట్టు తెలిసింది.


