TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వల్లభనేని మాటల్లో నిజం ఎంత?

Published on: Mon Apr 30, 2012 12:06PM

విజయవాడ అర్బన్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు వల్లభనేని వంశీ మాటల్లో నిజమెంత? అని విశ్లేషణ చేయడం కంటే వంశీ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కలవకుండా వుంటే బాగుంటుందని తెలుగుదేశంపార్టీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. జగన్ తో పూర్వపుపరిచయం, స్నేహం లేకపోతే అసలు పలుకరించాల్సిన అవసరం ఏమిటని తెలుగుదేశంపార్టీ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవైపు పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు రాష్ట్రం మొత్తం అప్ర్యటిస్తూ జగన్ అవినీతిని ఎండగడుతుంటే, వంశీ మాత్రం తనకు ట్రాఫిక్ లో ఎదురయ్యాడు, మర్యాదపూర్వకంగా పలుకరించానని చెప్పడాన్ని దేశం అభిమానులు అంగీకరించడం లేదు.

 

 

 

కాకతాళీయంగా జగన్ తనకు తారసపడటం జరిగిందనే మాటలకు కూడా కార్యకర్తలు విశ్వసించటం లేదు. తాను వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు, ఇందుకుగాను జగన్ విజయవాడ విచ్చేస్తున్నట్లు రెండు వారాలుగా వంగవీటి రాధాకృష్ణ చెబుతున్నారు. జగన్ మూడు గంటల ఫ్లయిట్ కు విజయవాడ వస్తున్నట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. కాని ఈ అంశాలు ఏమీ తెలియనట్టుగా తాను ట్రాఫిక్ లో ఇరుక్కుపోయానని, అదే సమయంలో జగన్ పలుకరించడంతో తాను పలుకరించానని చెప్పడాన్ని కార్యకర్తలు విశ్వసించడం లేదు.

 

 

ప్రత్యర్థి నేత ఎదురువస్తున్నట్టు తెలిస్తే సాధారణంగా ఎవరూ ఎదురు వెళ్ళడానికి సిద్ధపడరు. అంతేకాకుండా జగన్ వచ్చే సమయంలోనే తాను ప్రయాణం చేయాలనుకొంటే ఏలూరు రోడ్డు మీదుగా గన్నవరం వెళ్ళవచ్చు. కాని ఇందుకు పూర్తి విరుద్ధంగా జగన్ కు ఎదురు వెళ్ళడం, జగన్ పలుకరించడం వల్ల తాను పలుకరించానని చెప్పడం సరైన సమాధానం కాదని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధ్యక్శుడు చంద్రబాబునాయుడు స్వయంగా పరిటాల రవి హత్యకేసులో జగన్ కు సంబంధం వున్నట్టు ఆరోపణలు చేస్తున్నారు. ఒకవైపు రవి అభిమానినని చెబుతూనే రవి హత్య కేసులో ఆరోపణలకు గురైన జగన్ ను పలుకరించడం కూడా తెలుగుదేశంపార్టీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

 

 

పరిటాల రవి అనుచరునిగా తెలుగుదేశంపార్టీలో ప్రధానంగా కోస్తాప్రాంతానికి చెందిన కార్యకర్తలలో వల్లభనేని వంశీ పట్ల ఒక ప్రత్యేక అభిమానం వుంది. అయితే వంశీ ఏకంగా వై.ఎస్. జగన్ ను బహిరంగంగా పలుకరించడం, ఎంతో సాన్నిహిత్యం వున్నట్టుగా ఆలింగనం చేసుకోవడంతో వంశీకి పరిటాల రవి పట్ల వున్న అభిమానాన్ని కూడా శంకిస్తున్నారు. ఒకవైపు తాను పార్టీ వీడనని చెబుతూనే మరోవైపు తనకు ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలిచే సామర్థ్యం వున్నట్లు వంశీ ప్రకటించడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పార్టీ వీడనని చెప్పడం, పార్టీ అధ్యక్షుడిని కలిసి వివరణ ఇస్తానని చెప్పడం నిజమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేసే అంశం గురించి ప్రస్తావించవలసిన అవసరం లేదు. అంతేకాకుండా తాను రాజకీయాలతో సంబంధం లేకుండా పరిటాల రవి అభిమానినని ప్రకటించారు. తెలుగుదేశంపార్టీ కంటే తానే అధికుడునని వంశీ భావిస్తున్నట్లు అనిపిస్తోంది.

 

జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్టకు కూడా మచ్చ :-

జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితునిగా భావిస్తున్న వల్లభనేని వంశీ వ్యవహరించిన తీరు ఇటు జూనియర్ ఎన్.ట్.ఆర్. ప్రతిష్టను కూడా దెబ్బతీస్తోంది. వల్లభనేని వంశీ వివాదాస్పదం కావడం ఇదే ప్రథమం కాదు. ఆయన వివాదాస్పదం అయిన ప్రతిసారీ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కూడా ముందుకు వస్తోంది. పార్టీలో హరికృష్ణకు తగిన ప్రాధాన్యత లభించడంలేదని, కృష్ణాజిల్లా పర్యటనలో హరికృష్ణకు అవమానం జరిగిందంటూ ఏడాదిక్రితం వంశీ హడావుడి చేశారు.

 

 

పార్టీ వ్యవస్థాపకులైన ఎన్.ట్.రామారావు అసలైన వారసులు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అన్న విధంగా వ్యవహరించిన వంశీ నేడు నందమూరి తారక రామారావు కంటే జగన్ అధికుడనే తరహాలో వ్యవహరించడాన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా విమర్శిస్తున్నారు. కమ్మసామాజికవర్గం కూడా వంశీ వ్యవహారశైలిని తప్పుపడుతోంది. పైకి లౌకికవాదం గురించి ఎన్నికబుర్లు చెబుతున్నప్పటికీ రాష్ట్రంలో కులాల ఆధిపత్య పోరు కొనసాగుతునన్ సంగతి అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీలో ప్రధాన సామాజికవర్గాలుగా భావిస్తున్న రెడ్డి, కమ్మ, కాపు, క్షత్రియ వంటి సామాజికవర్గాలు వున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటినుంచి రాష్ట్ర రాజకీయాలలో రెడ్డి సామాజికవర్గానిదే పైచేయిగా వుంది. కాంగ్రెస్ పార్టీలో ఎన్ని ముఠాలు, వర్గాలు వున్నప్పటికీ ముఖ్యమంత్రి సీటు రెడ్డివర్గానికి చెందిన నేతలే కూర్చుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో వున్న కమ్మసామాజికవర్గం ఎంత ప్రయత్నించినా ముఖ్యమంత్రి స్థానాన్ని పొందలేకపోయింది. చివరకు తెలుగుదేశంపార్టీ ఆవిర్భవించిన తర్వాత ఆ సామాజికవర్గ కోరిక నెరవేరింది.

 

 

 వై.ఎస్. మరణాంతర పరిణామాలతో వై.ఎస్. జగన్ ఏర్పాటు చేసిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేడు సామాజికవర్గ పార్టీగా గుర్తింపు తెచ్చుకుంది. కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజికవర్గానిదే పైచేయిగా వున్నప్పటికీ సొంతంగా తమకంటూ ఒక పార్టీ వుండాలనే ధోరణి రెడ్డి సామాజికవర్గంలో కనిపిస్తోంది. ఆ కారణంగానే రాజకీయాల సంగతి ఎలా వున్నప్పటికీ రెడ్డి సామాజికవర్గం మొత్తం జగన్ మోహన్ రెడ్డిని తమ సామాజికవర్గ ప్రతినిధిగా, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని తమ పార్టీగా చూస్తున్నారు. రెడ్డి సామాజికవర్గం అంతవ్యూహంగా వ్యవహరిస్తుండగా అందకు విరుద్ధంగా కమ్మ సామాజికవర్గానికి అవమానకరంగాను, తెలుగుదేశంపార్టీకి నష్టం కలిగే విధంగా వల్లభనేని వంశీ రెడ్డి సామాజికవర్గానికి దాసోహం అనే రీతిలో వ్యవహరించడాన్ని కమ్మసామాజికవర్గం అవమానంగా భావిస్తోంది.

 

 

వంశీ ఈ విధంగా వ్యవహరించడం వెనుక హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పాత్రకూడా వుందనే ప్రచారం వల్ల కూడా తెలుగుదేశంపార్టీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరికృష్ణ తెలుగుదేశంపార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం కొత్త విషయం కాదని, గతంలో హరికృష్ణ సొంతంగా అన్న తెలుగుదేశంపార్టీ ఏర్పాటు చేసి కనీసం డిపాజిట్టు కూడా దక్కించుకోలేక పోయారు. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి తారక రామారావు కుమారునిగా హరికృష్ణ అలిగినా, తిరుగుబాటు చేసినా తెలుగుదేశంపార్టీలో కొనసాగితేనే తెలుగుదేశంపార్టీ అభిమానులు ఆదరిస్తారు. లేదంతే ఏకాకి కావాల్సిందేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు స్వయంగా ప్రతిభ వున్నప్పటికీ ఎన్.టి.ఆర్. మనవడు అనే మాటతో ఆయనను మొత్తం సామాజికవర్గం తమవానిగా భావిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ అందుకు విరుద్ధంగా తెలుగుదేశంపార్టీ అభిమానులను దూరం చేసుకొంటే జూనియర్ చివరకు ప్రతిభ కలిగిన కళాకారులు చాలామంది వున్నారని, వారిలో ఒకనిగా మిగిలిపోతాడనే భావన కూడా వ్యక్తం అవుతోంది.