TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బె..బె.. బెంబేలెత్తిస్తున్న బెజవాడ నేరస్థులు ...

Published on: Sat Apr 7, 2012 6:29AM

బె..బె.. బెంబేలెత్తిస్తున్న బెజవాడ నేరస్థులు ... చోద్యం చూస్తున్న పోలీసులు

బెజవాడ పౌరులు నేరస్థుల పడగలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. నగరంలో ఏ రోజుకారోజు నేరాల సంఖ్య పెరిగిపోతోంది. నేరాలను అరికట్టాల్సిన పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. దొంగతనాలు, దౌర్జన్యాల వంటి నేరాలతో పాటు మహిళలు, బాలికలపై అరాచకాలు నగరంలో పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2011 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది మార్చి కాలంలో నగరంలో మహిళలపై హింసకు పాల్పడిన సంఘటనలు సుమారు 1800 నమోదయ్యాయి. వరకట్నం వేధింపుల కేసులు కూడా నగరంలో బాగా పెరిగాయి.

2011 ఏప్రిల్ - 2012 మార్చి మధ్య విజయవాడ కమీషనరేట్ పరధిలో 996 వరకట్న కేసులు నమోదయ్యాయి. గత ఏడాది వీటి సంఖ్య 569గా నమోదయ్యింది. నగరంలో అభం శుభం తెలియని బాలికలను ప్రేమ పేరిట వంచించిన కేసులు కూడా 17 నుంచి 30కి పెరిగాయి. ఈవ్ టీజర్స్ ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ 567 మంది ఈవ్ టీజర్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనాల సంఖ్య కూడా దాదాపు 30 శాతం పెరిగింది. చైన్ స్నాచార్స్, బ్లేడ్ బ్యాంచ్ స్వైర విహారంతో సామాన్యులు రోడ్లపై తిరగడానికి భయపడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విజయవాడ నగరంలో బ్లేడ్ బ్యాచ్ లు తయారయ్యాయి. రేజర్ బ్లేడ్ లను ఆయుధాలుగా ఉపయోగిస్తున్న కొందరు ముఠా సభ్యులు ఉత్తిపుణ్యానికే రోడ్లపై వెళుతున్న వారిపై బ్లేడ్ లతో దాడులు జరుపుతున్నారు. ఈ దాడులు ఎక్కువగా రాత్రి వేళల్లో జరుగుతున్నాయి.

రైల్వే స్టేషన్, కృష్ణ లంక, పెజ్జోనిపేటకు చెందిన కొందరు యువకులు మద్యం సేవించి తగాదాలకు దిగుతూ, ఒకరిపై మరొకరు బ్లేడ్ లతో దాడులు చేసుకుంటున్నారు. ఈ బ్యాచ్ ల మధ్య జరిగిన గొడవల్లో ఇద్దరు మరణించారు. వీరిని అదుపుచేయడం పోలీసులకు సవాల్ గా మారింది. వీరికి తోడు చైన్ స్నాచర్లు కూడా మహిళలను బెంబేలెత్తిస్తున్నారు. మోటార్ బైక్ లపై వస్తున్న వీరు హఠాత్తుగా మహిళల వద్ద ప్రత్యక్షమై రెప్పపాటు కాలంలో మహిళల మెడల్లోని బంగారు వతువులను దోచుకుపోతున్నారు. తాజాగా సత్యనారాయణ పురంలోని ఒక ఇంట్లో కాలింగ్ బెల్ మోగడంతో తలుపు తీసిన మహిళ మెడలోని గోల్డ్ చైన్ ను లాక్కుపోయారు. నిత్యం ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నా పోలీసుల పనితీరు మాత్రం మెరుగుపడటం లేదు.