ఇదెక్కడి విడ్డూరం అంబటి గారు...

 

ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్టు అన్న సామెత ప్రకారం... ఎక్కడో విజయవాడలోని దుర్గ గుడిలో పూజలు జరిగితే.. దానికి.. చంద్రబాబుకు లింకు పెట్టడం విడ్డూరంగా ఉంది. ఇంతకీ లింక్ పెట్టింది ఎవరనుకుంటున్నారా...? ఇంకెవరూ ఎప్పుడు సందు దొరుకుతుందా... ఎప్పుడు చంద్రబాబుపై విరుచుకుపడదామా అని చూసే వైసీపీ బ్యాచ్. ఆ బ్యాచ్ లో రోజా, అంబటి లాంటి వాళ్లు మరీ.. మైకు దొరికితే చాలు.. రెచ్చిపోయి మరీ మాట్లాడుతుంటారు. అయితే ఈ సారి అంబటి ఆ ఛాన్స్ తీసుకున్నాడు. లోకేష్‌ను సీఎం చేసేందుకే దుర్గ గుడిలో తాంత్రిక పూజలు చేయించారు అంటూ కాకమ్మ కధలు చెప్పేశారు…


బెజవాడ కనకదుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరినట్టు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. డిసెంబరు 26వ తేదీన అమ్మవారి ఆలయంలో తాంత్రిక పూజలు జరిగాయని.. ఆలయానికి సంబంధించిన ఓ అధికారి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయని బయటపడింది. ఇక దీనిపై ఈవో సూర్యకుమారి మాట్లాడుతూ.. అలాంటివి ఏం జరగలేదు అని అంటున్నా.. ఈ మధ్య కాలంలో తనకు తగులుతున్న ఎదురుదెబ్బల నుంచి బైటపడేందుకు సూర్యకుమారే తాంత్రిక పూజలు జరిపించారని పాలకమండలి కమిటీలోని కొందరు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ వివాదంపై దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు స్పందించి..ఈ వివాదంపై  సూర్యకుమారితో మాట్లాడానని..భద్రీనాథ్‌తో వచ్చిన వ్యక్తిని కృష్ణాజిల్లా విశ్వనాథపల్లి ఆలయ అర్చకుడు రాజాగా గుర్తించామని ఆయన చెప్పారు. అయితే రాజాను గుడిలోకి తీసుకువెళ్లడం తప్పని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలకు ఆదేశించామని తెలిపారు.


ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఎప్పటిలాగే ఈ వివాదంపై కూడా స్పందించారు అంబటి గారు. స్పందించి.. చాలా విచిత్రమైన వ్యాఖ్యలే చేశారు. చంద్రబాబు నాయడు తనయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్‌ను సీఎం చేసేందుకే దుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయని అర్దంపర్దంలేని వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పూజ చేస్తూ దొరికిపోయిన తర్వాత ఆ తప్పును అధికారులపై నెట్టేయడానికి యత్నిస్తున్నారని.. తను చూసినట్టే చెప్పుకొచ్చారు. మరి విడ్డూరం కాకపోతే ఏదో విమర్శలు చేయాలని కాకపోతే ఏంటి అంబటి మాట్లాడే మాటలు. దుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరిగినందుకు కూడా చంద్రబాబే కారణమని ఇలాంటి మాటలు మాట్లాడటం మాంచి కామెడీగా ఉంది. విమర్శలు చేసినా కాస్త నలుగురు నమ్మేలా ఉండాలని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. అలా తాంత్రిక పూజలు చేస్తేనే సీఎం అయితే.. ఎన్నికలు ఎందుకు.. ఓట్లేయడం ఎందుకు. అంతేనా.. అలా పూజలకే సీఎం అయిపోతే.. జగన్ పాదయాత్రలు మానేని.. ఇప్పటికీ ఎన్ని పూజలు చేసేవాడో అని జనం అనుకుంటున్నారు.