దుర్గ గుడి ఈవో బదిలీ.. తెర వెనుక ఆ మంత్రి ఒత్తిడి!!

 

విజయవాడ కనకదుర్గ గుడి ఈవో కోటేశ్వరమ్మను బదిలీచేసి.. ఆమె స్థానంలో అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం ఇన్‌చార్జి ఈవో ఎన్‌వి.సురేష్‌బాబును నియమించేందుకు జగన్ సర్కార్ రంగం సిద్ధంచేస్తున్నట్లు కొద్దిరోజులుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలే నిజమయ్యాయి. అనుకున్నట్టుగానే కోటేశ్వరమ్మను బదిలీ చేస్తూ.. ఆమె స్థానంలో సురేష్‌బాబును నియమిస్తూ ప్రభుత్వం బుధవారం రాత్రి జీవో విడుదల చేసింది.

ముంబైలో ఐటీ శాఖ అధికారిగా పనిచేసిన ఐఆర్‌ఎస్‌ అధికారి కోటేశ్వరమ్మ డిప్యుటేషన్‌పై గతేడాది ఏపీకి వచ్చారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆమెను దుర్గగుడి ఈవోగా నియమించింది. కోటేశ్వరమ్మ దుర్గగుడి ఈవోగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. దుర్గగుడి ఈవోగా కోటేశ్వరమ్మ ఏడాది కాలమే పనిచేసినా ఇంద్రకీలాద్రిపై తనదైన ముద్ర వేసుకున్నారు. మంచి పేరు తెచ్చుకున్నారు.

కోటేశ్వరమ్మను బదిలీ చేసేందుకు జగన్ సర్కార్ సిద్ధమైందని వార్తలొచ్చిన సమయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. విపక్షాలు, స్థానిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేసారు. సీపీఐ విజయవాడ కార్యదర్శి దోనేపూడి శంకర్.. సీఎం జగన్ కు బహిరంగ లేఖ కూడా రాసారు. అవినీతిపై కొరడా ఝడిపించి.. నిజాయితీ, నిబద్ధతతో దుర్గ గుడికి విశేష సేవలు అందిస్తున్న కోటేశ్వరమ్మను బదిలీ చేయవద్దని లేఖలో కోరారు. అయినా జగన్ సర్కార్ ఆమెను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఆమె బదిలీ వెనుక ఓ మంత్రి ఉన్నట్లు తెలుస్తోంది. దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మను తక్షణమే బదిలీ చేయాలంటూ జిల్లాకు చెందిన ఒకమంత్రి తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావడం వల్లే ప్రభుత్వం ఆమెను బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసిందని ప్రచారం జరుగుతోంది.