TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం

Published on: Mon Sep 8, 2014 10:59PM

 

పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్లు విజయవాడ వద్ద రాజధాని నిర్మించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అక్కడ భూములపై భారీగా పెట్టుబడులు పెట్టిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, రియల్టర్లు అది తమకు కాసుల వర్షం కురిపించబోతోందని సంతోషంతో ఎగిరి గంతులు వేస్తుంటే, రెక్కాడితే కాని డొక్కాడని వేతన జీవులు, అద్దె కొంపల్లో రోజులు వెళ్ళదీస్తున్నబడుగు, మధ్యతరగతి ప్రజల జేబులు చిల్లుపెడుతోందని ఆవేదన చెందుతున్నారు.

 

అయితే అంతమాత్రాన్న వారు విజయవాడవద్ద రాజధాని నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేఖించడం లేదు. కానీ ఆ పేరుతో పెరిగిపోయిన భూముల ధరలు, ఇళ్ళ అద్దెలను నియంత్రించని అధికారుల ఉదాసీనతను వారు తప్పు పడుతున్నారు. స్వంత ఇల్లు కట్టుకోవాలనే తమ కలలు ఇక ఎన్నటికీ కలలుగానే మిగిలిపోవడమే కాకుండా కనీసం ఇప్పుడు అద్దె కొంపల్లో జీవనం కూడా కష్టమయిపోతోందని మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

మూడు నాలుగు నెలల క్రితం నెలకు మూడు వేలు అద్దె ఉండే ఇళ్ళు ఇప్పుడు ఒకేసారి నాలుగు నుండి ఐదు వేలకి పెంచేయడంతో మధ్యతరగతి ప్రజలు విలవిలలాడుతున్నారు. అదేవిధంగా ఇల్లు కట్టుకొందామనో లేకపోతే కనీసం అపార్ట్ మెంటులో చిన్న ఫ్లాటయినా కొనుకొందామనో బ్యాంకు లోన్లు తీసుకొనే సాహసం కూడా చేయలేకపోతున్నారు. ఇప్పుడే ఈ పరిస్థితి ఈవిధంగా ఉంటే, రాజధాని నిర్మాణం మొదలయిన తరువాత పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందేమో!

 

శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికలో ఈ సమస్యలను కూడా ప్రస్తావించింది. అందువలన రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ చుట్టూ కనీసం ఒక్క ఏడాదిపాటు భూముల ధరలు, ఇంటి అద్దెలు పెరగకుండా నియంత్రించగలిగితే అందరూ హర్షిస్తారు.